Budget 2024: గంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్; ఇది కూడా రికార్డే..
01 February 2024, 14:19 IST
Nirmala Sitharaman's shortest budget speech: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం 2024 మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె 58 నిమిషాల పాటు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
2024 మధ్యంతర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం.. తన బడ్జెట్ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం చేసిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది. కాగా, అతి తక్కువ సమయం చేసిన బడ్జెట్ ప్రసంగంగా రికార్డుల్లో ఉన్నది 1977లో కేంద్ర బడ్జెట్ (union budget) ను ప్రవేశపెట్టిన హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన ప్రసంగం. నాడు ఆయన చేసిన ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.
ఉదయం 11 గంటల నుంచి..
2024 మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మల సీతారామన్ సరిగ్గా ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. 58 నిమిషాల పాటు ప్రసంగించి, 11.58 గంటలకు ముగించారు. అంటే, గంటలోపే తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. దాదాపు 58 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగం ఆమె బడ్జెట్ ప్రసంగ రికార్డుల్లో అతి చిన్న రికార్డుగా నిలిచింది. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆరు బడ్జెట్లలో అతి తక్కువ సమయం చేసిన ప్రసంగం 2023లో చేశారు అప్పుడు ఆమె 87 నిమిషాలు ప్రసంగించారు.
2020 లో అత్యధిక సమయం
2020 లో బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ 2.42 గంటల పాటు ప్రసంగించారు. అలా, భారతదేశంలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. కాగా, పదాల సంఖ్య ప్రకారం అత్యధిక పదాలున్న బడ్జెట్ గా ఉన్న రికార్డు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. నాడు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక దశ, దిశలను మార్చింది.
2047 నాటికి వికసిత భారత్
లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం జులైలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న మోదీ ప్రభుత్వం.. అప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో తమ ప్రభుత్వ లక్ష్యమైన ‘వికసిత భారత్’ సాధనకు సవివరమైన రోడ్ మ్యాప్ ను ప్రవేశపెడుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
నాలుగు ప్రధాన వర్గాలు..
భారతదేశంలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన నాలుగు వర్గాలు ఉన్నాయని ప్రధాని మోదీ గట్టిగా నమ్ముతున్నారని నిర్మల సీతారామన్ తెలిపారు. ‘‘అవి, 'గరీబ్' (పేదలు), 'మహిళా' (మహిళలు), 'యువ' (యువత), 'అన్నదాత' (రైతు). వారి అవసరాలు, వారి ఆకాంక్షలు, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. వారు పురోగమిస్తేనే దేశం పురోభివృద్ధి చెందుతుంది. ఈ నాలుగు వర్గాల వారికి తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. వారి సాధికారత, శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మల పేర్కొన్నారు.
టాపిక్