Budget 2024: ఉచిత విద్యుత్, మధ్యతరగతికి ఇళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
Budget 2024 Highlights: సౌర విద్యుత్ కు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో రూఫ్ టాప్ సోలారైజేషన్ విధానం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. అవి..
ఉచిత సౌర విద్యుత్
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా చేసే అవకాశం లభిస్తుంది. మిగులు విద్యుత్ ను డిస్కమ్ లకు విక్రయించే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్
విక్రేతలకు వ్యవస్థాపక అవకాశాలు కల్పించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇన్ స్టలేషన్, నిర్వహణలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు.
రైతుల ఆదాయం పెంచడానికి..
వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయ పెంచడానికి వివిధ చర్యలు చేపట్టనున్నారు. అగ్రిగేషన్, మోడ్రన్ స్టోరేజ్ ఫెసిలిటీలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ తో సహా పంట చేతికి వచ్చిన తరువాత చోటు చేసుకునే కార్యకలాపాలలో ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
నానో డీఏపీ
నానో యూరియా విజయవంతం కావడంతో వివిధ పంటలపై నానో డీఏపీ అప్లికేషన్ ను అన్ని వ్యవసాయ వాతావరణ జోన్లలో విస్తరిస్తారు.
మధ్యతరగతికి గృహనిర్మాణం
అద్దె ఇళ్లు, మురికివాడలు, బస్తీలు, అనధికార కాలనీల్లో నివసిస్తున్న మధ్యతరగతిలోని అర్హులైన వర్గాలకు సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించడానికి సహాయపడే పథకాన్ని ప్రారంభించనున్నారు.
మెడికల్ కాలేజీల విస్తరణ
ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బాలికలకు వ్యాక్సినేషన్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నివారించడానికి 9 - 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు సర్వైకల్ కేన్సర్ ను నిరోధించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు.
సమగ్ర మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం
మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కింద వివిధ పథకాలను ఒక సమగ్ర కార్యక్రమంగా విలీనం చేసి, అమలులో మెరుగైన సమన్వయం చేయనున్నారు.
ఆయుష్మాన్ భారత్ కవరేజీ పొడిగింపు
ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరించనున్నారు.
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్
పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, ఉత్పాదకత, ఆదాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి విలువ జోడింపు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఆత్మనిర్భర్ నూనెగింజల అభియాన్
పరిశోధన, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, మార్కెట్ లింకేజీలు, పంటల బీమా ద్వారా నూనెగింజల్లో స్వావలంబన సాధించేందుకు వ్యూహరచన చేయనున్నారు.
డెయిరీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
పాడి రైతులను ఆదుకోవడానికి సమగ్ర కార్యక్రమం రూపకల్పన, ఉత్పాదకతను పెంచడానికి ప్రస్తుతం ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవడం.
మత్స్య సంపద
ప్రభుత్వ చొరవతో మత్స్యశాఖకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్యరంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం.
పెట్టుబడులను ప్రోత్సహించడం
ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలపై చర్చలు జరపడం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణలకు మద్దతుగా రూ.75,000 కోట్లను వడ్డీలేని రుణాలుగా అందించడం సహా స్థిరమైన విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు.
సామాజిక మార్పులు
జనాభా పెరుగుదల, జనాభా మార్పుల వల్ల తలెత్తే సవాళ్లను సమగ్రంగా పరిష్కరించడానికి, సమగ్ర పరిష్కారాల కోసం సిఫార్సులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.