AP RepublicDay: ఏపీలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా సంక్షేమం అమలు - గవర్నర్ నజీర్
AP RepublicDay: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
AP RepublicDay: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమాన్ని అర్హులైన ప్రతిఒక్కరికి కుల, మత, రాజకీయ వివక్షలకు అతీతంగా అందిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకు ముందు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మువ్వన్నెల జెండా సాక్షిగా స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి నివాళులు అర్పించారు.
భిన్నత్వంలో ఏకత్వం, సోదరభావంతో భారత గణతంత్రం మనుగడ సాగిస్తోందని గవర్నర్ చెప్పారు. పేదరికం, సామాజిక అసమతుల్యతపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు.
ఏపీ రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ప్రజల సహకారం మరువ లేనిదని చెప్పారు. వారం క్రితమే 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సోషలిజం, సెక్యులరిజం, గణతంత్ర రాజ్య భావనల స్ఫూర్తిగా నెలకొల్పినట్టు చెప్పారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజా సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించేలా పథకాలను తీర్చిదిద్దినట్టు చెప్పారు.
ఖచ్చితమైన, పారదర్శకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా 56నెలల పాలన సాగిందని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ఉద్దేశాలు, ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించినట్లు చెప్పారు.
గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలను నెలకొల్పినట్టు చెప్పారు. 15004 గ్రామ సచివాలయాల్లో 540 రకాల సేవల్ని ప్రజల ముగింట అందిస్తున్నట్లు చెప్పారు. 1.35లక్షల గ్రామ సచివాలయ సిబ్బంది, 2.66 లక్షల వాలంటీర్లు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారు.
వ్యవసాయ అవసరాలు తీర్చేలా రైతు భరోసా కేంద్రాలు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విలేజ్ హెల్త్ క్లినిక్స్, విద్యాబోధనలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు 56703 స్కూళ్లలో 17,805 కోట్లతో నాడు నేడు కార్యక్రమాలను అమలు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుతో వర్క ఫ్రం హోమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రేషన్ సరుకుల్ని 9260 మొబైల్ యూనిట్లతో ఇంటి వద్దే డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కూడా నేరుగా ఇంటి వద్దే అందిస్తున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు కోటి సర్టిఫికెట్లను ఇంటి వద్దే అంద చేసినట్టు చెప్పారు. అన్ని రకాల ధృవీకరణలు ఇళ్ల వద్దే ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో విద్యార్ధులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలకు పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15వేల రుపాయలు చెల్లిస్తున్నామని 83లక్షల మందికి లబ్ది కలిగిస్తున్నట్లు చెప్పారు.
అమ్మఒడి, విద్యాదీవెన, నాడు నేడు, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలతో విద్యార్ధుల జీవితాలను మార్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, సిబిఎస్‌ఇ, ఐబి సిలబస్‌లతో విద్యార్ధుల జీవితాల్లో సమూల మార్పులు తెస్తున్నట్లు గవర్నర్ చెప్పారు.