AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్-amaravati news in telugu ap cabinet approved to give dsc notification with 6100 posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Bandaru Satyaprasad HT Telugu
Jan 31, 2024 02:08 PM IST

AP DSC Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం

AP DSC Notification : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్లపాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ డీఎస్సీతో పాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో నాన్‌ టీచింగ్ స్టాఫ్‌ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టెట్ ఆన్‌లైన్‌ అప్లికేషన్లు స్వీకరించనున్నారని తెలుస్తోంది. దరఖాస్తుల ఆధారంగా టెట్ షెడ్యూల్‌(AP TET Syllabus) నిర్ణయించనున్నారు. టెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ(DSC 2024) కి అప్లికేషన్లు స్వీకరణ, పరీక్షల నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

టెట్ అర్హతలు

ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నిర్వహించే టెట్‌-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది.

అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు నియామక బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత కథనం