పితృదేవతలు అంటే ఎవరు? వారికి తర్పణాలు ఎందుకు వదలాలి?
18 September 2024, 12:00 IST
- మహాలయ పక్షాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పదిహేను రోజులు పూర్వీకులను స్మరించుకుంటూ వారికి తర్పణాలు వదలాలి. అసలు పితృ దేవతలు ఎవరు? వారికి తర్పణాలు ఎందుకు వదలాలి అనే విషయాల గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు.
పితృ దేవతలు ఎవరు?
పితృదేవతలు వసు, రుద్ర, ఆదిత్యులుగా మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు ఉంటారన్నారు. చనిపోయిన వారు ఏ రూపంలో ఉన్నా వసు, రుద్ర, ఆదిత్యులు పితృదేవతలకు అందిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
పితృదేవతలకు తర్పణాలు సమర్పించేటప్పుడు అపసవ్యంగా అంటే కుడిభుజం మీద ఉపవీతం ఉండాలన్నారు. పితృతర్పణ దక్షిణ దిక్కుకు తిరిగి ఎడమకాలు మడిచి తర్పణ ఇవ్వాలన్నారు. పితృదేవతలకు తర్పణాలను దర్భ మొదళ్ళ నుంచి వదలాలని దక్షుడు తెలిపాడని ఆయన వివరించారు. నువ్వులు, గంధం కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని పద్మపురాణం చెబుతోందన్నారు. బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యనుండి పితృదేవతలకు తర్పణం వదలాలన్నారు.
త్రిమూర్తులకు, ప్రజాపతులకు, దేవతలకు, ఛందస్సు, వేదములు, రుషులు, ఆచార్యులు, వారిపుత్రులు, సంవత్సర, రుతువులు, గంధర్వ, అప్సరస, నాగ, యక్ష, రాక్షస, పిశాచ, గరుడ, భూతములకు, సాగరాలకు, పర్వతాలకు, నదులకు తర్పణాలు ఇవ్వాలని యాజ్ఞవల్క్యుడు తెలిపాడని పంచాంగకర్త ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు. అలాగే మన జీవనానికి ఉపయోగపడే పశువులకు, వనస్పతులకు, ఓషధులకు తర్పణాలు ఇవ్వాలని తెలిపారు.
యజ్ఞోపవీతాన్ని దండగా వేసుకుని చిటికెన వేలు మొదటి నుంచి నీటిని వదిలిపెడుతూ సనకసనందన సనాతనులకు, కపిల, ఆసురీ, ఓఢ, పంచశిఖులనువారికి, ఋషులకు, నారదునకు తర్పణాలివ్వాలని పద్మపురాణం చెబుతోందన్నారు. యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా చేసుకుని దక్షిణ దిక్కుకు తిరిగి, దివ్యాంబరధర, ధ్రువ మొదలైన వసువులకు తర్పణాలనివ్వాలని పద్మపురాణం చెబుతోందని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
అజైకపాద మొదలైన రుద్రులకు, ఇంద్ర, ధార మొదలైన ఆదిత్యులకు దక్షిణ దిక్కుకు తిరిగి తర్పణాలివ్వాలన్నారు. తండ్రి జీవించి ఉన్నప్పటికీ కవ్యవాల, నల, సోమ, యమ, అర్యమ, అగ్నిష్వాత్, సోమప, బర్హిషాదులకు దక్షిణ దిక్కుకు తిరిగి తర్పణాలను ఇవ్వాలని అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్