Flowers for puja: అఖిల దేవతా పుష్ప ఆరాధన ఎలా చేయాలి? ఎటువంటి పుష్పాలు దేవతలకు సమర్పించాలి?
Flowers for puja: నిత్యం చేసే పూజలో ఎటువంటి పూలు ఉపయోగించాలి. ఎలాంటి పూలు పూజకు ఉపయోగించకూడదు. శాస్త్రాల ప్రకారం అఖిల దేవతా పుష్ప ఆరాధన ఎలా చేయాలి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Flowers for puja: దేవతలకు ఎటువంటి పుష్పాలను సమర్పించాలి? అన్న ప్రశ్నకు "విష్ణు ధర్మోత్తర పురాణం"లో శ్రీమహావిష్ణువు ఈ విధంగా తెలియచేస్తాడు.
"ఇతరుల నుండి గ్రహించినవాటికంటే... వెల ఇచ్చి కొన్నవాటికంటే.... అనుమతి లేకుండా ఇతరుల ఇంటి పెరడులోని పూల మొక్కల నుండి సేకరించిన వాటికంటే నీ ఇంటి పెరడులోని పూల మొక్క నుండి ఒక్క పుష్పము తెచ్చి నాకు సమర్పించినా చాలు నిన్ను అనుగ్రహిస్తాను” దేవుడికి సమర్పించే పుష్పాల గురించి శాస్త్రాలు కొన్ని నియమాలను చెప్తున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
1. వాడిన పువ్వులు దేవుడికి సమర్పించరాదు.
2. ప్రసాదంగా, వాయినంగా, దానంతో పాటు వచ్చిన పుష్పాలు దేవుడికి సమర్పించరాదు.
3. సువాసనలేని పుష్పాలు దైవపూజకు నిషిద్దం.
4. అపరిశుభ్ర ప్రదేశాల నుంచి సేకరించిన పుష్పాలు నిషిద్ధము.
5. ఒకసారి పూజకు ఉపయోగించిన పుష్పాలను మరలా పూజకు వినియోగించరాదు.
6. రేకులు సంపూర్ణంగా లేని పువ్వులతో పూజించరాదు.
7. చెడు తిథి, నక్షత్ర, వార, వర్జ్యములందు సేకరించిన పుష్పములను పూజకు ఉపయోగించరాదు.
8. ఇతరుల నుండి గ్రహించిన పుష్పాలను వినియోగించరాదు.
9. వాసన చూసిన పుష్పాలను పూజకు వాడరాదు.
10. సూర్యాస్తమయ సమయమందు, అమావాస్య రాత్రి నందు సేకరించిన పుష్పాలు పూజకు నిషిద్ధము.
11. క్రింద పడిన పువ్వులను పూజకు వినియోగించరాదు (కొన్ని జాతి పుష్పాలకు ఈ నిషిద్ధము లేదని శాస్త్రం)
12. మైలవారి ఇంట నుండి తెచ్చిన పుష్పాలు పూజకు వాడరాదు.
ఎటువంటి పుష్పాలు పూజకు అర్హమైనవి?
ఎటువంటి పుష్పాలతో దైవాన్ని పూజించాలి అన్నది చాలామందికి తెలియదు. ఒకానొక సందర్భములో నారదుడు ఈ విధంగా చెప్పాడు. ప్రాతఃకాలంలో స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ముందుగా పూలచెట్టుకు నమస్కరించి భగవన్నామ స్మరణ (ఇష్టదేవతా స్తుతి) చేస్తూ సేకరించిన పుష్పాలతో దేవుడిని అర్చించడం మంగళకరం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శాస్త్రాలు కూడా కొన్ని రకాల పుష్పాలు మాత్రమే దైవార్చనకు అర్హమైనవిగా చెప్తున్నాయి.
1. సువాసన భరితమైనవి.
2. స్నాన సంధ్యాదులనంతరం మాత్రమే సేకరించినవి.
3. తొడిమలు, రేకులు ఊడిపోకుండా ఉన్నవి.
4. ఆకులు లేకుండా ఉన్న పుష్పములు.
5. పూర్తిగా విచ్చుకున్న పుష్పాలు.
6. స్వయంగా సేకరించుకున్నవి (అవకాశం లేనివారు ఇతరులు సేకరించి ఇచ్చినవి, వెల చెల్లించి కొన్నివి కూడా దైవ పూజలో వినియోగించడం శాస్త్ర సమ్మతమే).
7. మాలగా కట్టిన పుష్పములతో (అష్టోత్తర సహస్రనామములతో పూజించేవారు విడి పూలను వాడటం శాస్త్రసమ్మతమే. నిత్య పూజలో కూడా విడి పువ్వుల అర్చన శాస్త్రాంగీకారమే)
8. దైవార్చన నిమిత్తం ఇతరులు ఇచ్చిన పుష్పాలు.
9. సామూహిక పూజా సమయంలో భక్తులు సమర్పించిన పుష్పాలు.
10. ఒకే వర్ణం ఉన్న పుష్పాలు
11. అడవినందు పూచే కొన్ని జాతుల పుష్పాలు.
12. కాయగా మారని పుష్పాలు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.