Karthika masam 2024: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం? ఈ మాసం విశిష్టత ఏంటి?
16 October 2024, 7:00 IST
- Karthika masam 2024: మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి? ఎందుకు ఇది పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో తెలుసుకుందాం.
కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం
అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీకమాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసం ఇది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అనే పేరు వచ్చింది.
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ భోళా శంకరుడి అనుగ్రహం పొందటం కోసం ప్రయత్నిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.
కార్తీకమాసంలో ఏ శివాలయం చూసినా భక్తులతో కిటకిటలాడిపోతుంది. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ భక్తులు శివుని అనుగ్రహం కోసం పరితపిస్తారు. అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. కార్తీక మాసం మొదటి రోజు నుంచి మకర సంక్రాంతి వరకు దీక్షలు చేస్తారు. శివాలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ తమ దోషాలు, బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ శివుడికి మొరపెట్టుకుంటారు.
శివారాధన
ఈ మాసంలో శివలింగానికి బిల్వ దళాలతో అర్చన చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు పవిత్ర నదీ స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో విడిచిపెడతారు. ఇక సోమవారాలు అత్యంత విశిష్టమైనవిగా పిలుస్తారు.
శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని, ఈతి బాధలు ఉండవని నమ్ముతారు. ప్రదోష కాలంలో చేసే శివారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే కార్తీకమాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినది. సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కొంతమంది కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు.
మాంసాహారం నిషిద్ధం
కార్తీక మాసంలో భక్తులు మాంసాహరానికి దూరంగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరం పెడతారు. ఈ మాసం మొత్తం కేవలం పూజలు, వ్రతాలు, నోములు జరుపుకునేందుకు విశిష్టమైనది. కార్తీక పురాణం చదివిన వారికి విన్న వారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని, వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్ముతారు.
ఉసిరి పూజ
కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా పేర్కొంటారు. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం చేస్తారు. వీటినే వన భోజనాలు అంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.
అయ్యప్ప దీక్ష
కార్తీక మాసం తొలి రోజు నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభం అవుతాయి. 41 రోజుల పాటు భక్తులు మండల పూజ దీక్ష చేపడతారు. ఈ సమయంలో భక్తులు కఠినమైన నియమాలు ఆచరిస్తూ ఉపవాసాలు పాటిస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించి భక్తులు నిత్యం పూజలు, భజనల్లో పాల్గొంటారు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు పునీతులు అవుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.