Lord shiva: శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఎలా ప్రదక్షిణలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది-how to do pradakshina in shiva temple if you do this pradakshina you will get merit ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva: శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఎలా ప్రదక్షిణలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది

Lord shiva: శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఎలా ప్రదక్షిణలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది

Gunti Soundarya HT Telugu
Mar 08, 2024 03:58 PM IST

Lord shiva: ఇతర ఆలయాలతో పోలిస్తే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు చాలా తేడా ఉంటుంది. శివాలయంలో ఎలా ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేస్తే పుణ్యఫలం దక్కుతుందనే విషయం తెలుసుకోండి.

శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి?
శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? (pinterest)

Lord shiva: కొంతమంది ప్రతిరోజు గుడికి వెళతారు. దేవుడిని దర్శించుకునే మనసుకి హాయిగా ఉంటుంది. మరికొందరు వారానికి ఒకసారైన వెళతారు. అక్కడ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలో ఒక ప్రవేశించి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు.

మనసు, ఆలోచనలు పవిత్రంగా చేసే ప్రదేశం దేవాలయం. కాళ్ళు శుభ్రంగా కడుక్కుని గుడిలోకి ప్రవేశిస్తారు. నేరుగా దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్ళకుండా ముందుగా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. అన్ని దేవాలయాలలో ఇలాగే చేస్తారు. కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. మహాదేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని, అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

నేడు మహా శివరాత్రి. ప్రతి ఒక్కరూ శివాలయం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. శివార్చన, అభిషేకం, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. రాత్రంతా గుడిలో ఉండి శివనామ స్మరణతో ధ్యానం చేస్తారు. కొంతమంది తప్పనిసరిగా శివయ్యని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి.

శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు. శివాలయంలో ఉండే ధ్వజ స్తంభం( నందీశ్వరుడు) దగ్గర నుంచి ఎడమ పక్కగా గర్భాలయం వెనక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సోమసూత్రం అంటే గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన జలం బయటికి వెళ్లే దారి.

లింగ పురాణం ప్రకారం సోమసూత్రాన్ని దాటడం వల్ల మీరు చేసే ప్రదక్షిణకు ఎటువంటి ఫలం ఉండదు. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒక క్షణం ఆగి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్లాలి. ఇలా మూడు ప్రదక్షిణలు పూర్తి చేయాలి. శివాలయంలో ప్రదక్షణలు చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటకూడదు. అక్కడ ప్రమద గణాలు కొలువై ఉంటాయని వారిని దాటితే తప్పు చేసిన వాళ్ళు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లింగ పురాణం ప్రకారం శివాలయంలో ఈ విధంగా చేసే ఒక ప్రదక్షణ పదివేల ప్రదక్షిణాలతో సమానంగా భావిస్తారు. మీ శక్తిని అనుసారం ఈ విధంగా ప్రదక్షిణలు చేయవచ్చు. ప్రదక్షిణలు బేసి సంఖ్యలో చేయాలి. 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణలు అయిన చేయవచ్చు.

ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించాలి

యానికానీ చ పాపా అని జన్మంతరకృతానిచ।

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ।।

పాపొహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ ।

త్రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల ।।

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।

తస్మాత్కారుణ్య భావని రక్ష రక్ష మహేశ్వర।।