ప్రదక్షిణ ఎలా చేయాలి? ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయి?-how to do pradakshina in temple how many types of pradakshinas are there ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ప్రదక్షిణ ఎలా చేయాలి? ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయి?

ప్రదక్షిణ ఎలా చేయాలి? ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయి?

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 06:05 AM IST

ప్రదక్షిణ ఎలా చేయాలి? ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయి? వంటి విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

తిరుమల శ్రీనివాసుడు
తిరుమల శ్రీనివాసుడు

సనాతన ధర్మంలో ఆలయాలను దర్శించడం, ఆలయాల్లో భగవంతుని పూజించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఆలయాలను దర్శించినపుడు నేరుగా దైవదర్శనం చేయకుండా ప్రదక్షిణ చేయడం సనాతన ధర్మంలో ఉన్న ఆచారం. అక్కడ దైవాన్ని దర్శించేందుకు నేరుగా గుడిలోనికి వెళ్లకుండా, ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేయడం అనూచానంగా వస్తున్న ఆచారం. పాదాలు చేతులు ప్రక్షాళన చేసుకోవడంతో మొదలవుతుంది. భగవత్‌ కైంకర్యం.

భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ రెందోది. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్ధం. మనసులో భక్తి, విశ్వాసం, నైర్మల్యం నింపుకొని ప్రదక్షిణలు చేయాలి. ఎడమవైపు నుంచి కుడివైపు మాత్రమే తిరగాలి. కళ్ళు విప్పుకొని దేవాలయ పరిసరాలను, మూర్తిని చూస్తూ తిరగాలి. మంచి ఆలోచనలతోనే ప్రదక్షిణ చేయాలి.

ప్రదక్షిణ ఎన్ని రకాలుగా చేయొచ్చు?

అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం, రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ నోటితో భగవన్నామస్మరణ చేస్తూ వెళ్ళడం, మనసులో తలుస్తూ వెళ్ళడం. పరమాత్ముని. అలా చేసేటప్పుడు మన ధ్యాస, ధ్యానం ఆ దైవం పైనే లగ్నం కావడం ఆవశ్యకం. ప్రదక్షిణ చేసేటప్పుడు మన ఆత్మ పరమాత్మ చుట్టూ పరిభ్రమించాలి.

ఏ దేవాలయంలో ఏ దేవుడి, దేవతలను ప్రధానంగా ప్రతిష్టించారో వారినే ధ్యానించాలి. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు. ప్రత్యేక క్రతువు సాగుతుంది. ఎంతో శ్రమకోర్చి జపతపాదులు, హోమాలు, అనుష్టానాలు చేసి విగ్రహాన్ని మంత్ర యంత్ర బద్ధంగా ప్రతిష్టిస్తారు. ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉన్న దివ్య తేజస్సు, శక్తి నలువైపులా కాంతిపుంజంలా వ్యాపించి పరిసరాల్లో ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మన శరీరాలను తాకి ఉపశమనాన్ని కలిగించి, మనోబలాన్ని ఇస్తుందంటారు.

ప్రదక్షిణలో ఆత్మప్రదక్షిణ, ప్రాకార ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ అనే రకాలున్నాయి. గుడిలో పూజ అనంతరం ఆర్బక స్వాములు ప్రదక్షిణలు చేయమంటారు. మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్ముతాం. ఎవరికి వారే తమ చుట్టూ తాము తిరిగి చేసేదాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు.

ప్రాకార ప్రదక్షిణ అంటే మూల విగ్రహానికి చేసే ప్రదక్షిణ. ఇలాంటప్పుడు దైవానికి, అష్టదిక్బాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు. ప్రాకార ప్రదక్షిణలో నాలుగు రకాలున్నాయి. ధ్వజ స్తంభం ప్రదక్షిణ ప్రాకార ప్రదక్షిణతో కలిసి ఉంటుంది. తరువాత పాద ప్రదక్షిణ. దీన్నే పడి ప్రదక్షిణ అంటారు. పాదానికి పాదం తాకిస్తూ అడుగులు వేస్తూ చుట్టూ తిరగడం. పిదప నమస్కార ప్రదక్షిణ. ఆ తరువాతది అంగప్రదక్షిణ. దీన్నే పొర్లు దండాలు అని కూడా అంటారు. ధ్వజ స్తంభం నుంచి సాష్టాంగ నమస్మారంతో సవ్య దిశలో ప్రారంభించాలి. అలా పొర్లుకుంటూ తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరడంతో అంగప్రదక్షిణ పూర్తవుతుంది.

శాస్త్రాలు, శివపురాణం ప్రకారం శివలింగానికి అర్ధ ప్రదక్షిణ చేస్తారు. అంటే సగం వరకు ప్రదక్షిణ చేసి మరల వెనుకకు తిరిగి ప్రదక్షిణ చేయాలి.

గిరి ప్రదక్షిణ(కొండ చుట్టూ) పూర్వకాలం నుంచి ప్రాముఖ్యం సంతరించుకుంది. దీనికి మరో పేరు పరిక్రమణ. ఒకసారి గిరి పక్షం చేస్తే కోటి సార్లు అంగప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహ సమయంలో వధూవరులు అగ్ని ప్రదక్షిణ చేస్తే అగ్నిసాక్షి గా వివాహం జరిగినట్లు పరిగణనలోకి తీసుకుంటారు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్