Ayyappa Deeksha Days: అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు ఆచరించాలి? ఈ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి?-how many days are there in ayyappa mala what are the rules in this diksha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayyappa Deeksha Days: అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు ఆచరించాలి? ఈ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి?

Ayyappa Deeksha Days: అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు ఆచరించాలి? ఈ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Aug 23, 2024 10:14 AM IST

Ayyappa Deeksha Days: కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అయ్యప్ప దీక్ష చేపడతారు. అసలు ఈ దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది. ఈ సమయంలో ఆచరించాల్సిన నియమాలు ఏంటి? మాల ధరించిన వ్యక్తిని స్వామి అని ఎందుకు పిలుస్తారు అనే విషయాలు తెలుసుకుందాం.

అయ్యప్ప మాల నియమాలు
అయ్యప్ప మాల నియమాలు

కార్తీకమాసం మొదలు కావడంతోనే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర ప్రాంతాలలోని కాకుండా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరిస్తారు. 41 రోజుల పాటు ఉండే ఈ అయ్యప్ప దీక్ష మనిషిని నిజమైన భక్తుడిగా మారేందుకు దోహదపడుతుంది.

అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు?

మనసు, శరీరం, కఠినమైన జీవనశైలి అవలంభిస్తూ నిత్యం అయ్యప్ప స్వామి నామ స్మరణలో భక్తులు నిమగ్నమవుతారు. అయ్యప్ప భగవానుడి దర్శనం కోసం ఆకాంక్షించే భక్తులు మానసికంగా, శారీరకంగా పవిత్రంగా ఉండాలి. మొక్కుబడిగా మాలధారణ చేయడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు దైవం దృష్టిలోనూ పాపంగా మారుతుంది. మలయాళ నెల వృశ్చికం మొదటి రోజు నుంచి 41 రోజుల అయ్యప్ప దీక్ష చేస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కార్తీకమాసంలో వేసుకుంటారు. మొదటి సారి మాల ధరించి శబరిమలకు తొలి యాత్రకు వెళ్ళే యాత్రికుడిని కన్ని అయ్యప్ప అంటారు.

పద్దెనిమిది సంవత్సరాల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన వారిని గురు స్వాములు అంటారు. మాల ధరించాలని అనుకున్న భక్తుడు తన తల్లిదండ్రులు, గురువు నుంచి అనుమతి పొందిన తర్వాత 41 రోజుల వ్రత దీక్ష ప్రారంభిస్తాడు. ఈ మాల ధరించిన వ్యక్తితో పాటు అతని కుటుంబం కూడా నియమాలు ఆచరించాలి. అయ్యప్ప మాల ధరించే వ్యక్తి ఎటువంటి నియమాలు పాటించాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

అయ్యప్ప దీక్ష నియమాలు

గురు స్వామి లేదా తల్లిదండ్రులు సమక్షంలో మాలధారణ చేసుకోవచ్చు. తులసి లేదా రుద్రాక్షలు కలిగిన మాలను మెడలో ధరిస్తారు. ఈ పవితమైన మాల ధరించినప్పుడు భక్తుడు పూర్తి విధేయతతో అయ్యప్ప స్వామికి ఉంటానని ప్రమాణం చేస్తాడు.

41 రోజుల బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒక సన్యాసి మాదిరిగా కఠినమైన జీవితాన్ని ప్రారంభించాలి. దీక్ష ప్రారంభించిన మొదటి రోజు నుంచి 41 రోజులపాటు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి అయ్యప్ప స్వామికి పూజలు చేస్తారు. గురుస్వామితో కలిసి ఆలయానికి వెళ్తారు.

భక్తుడు అన్ని సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కేవలం ప్రార్ధనలు, పూజలు, భజనలు, ఆలయ సందర్శనాలు, దేవాలయాలను శుభ్రపరచడం పేదలకు ఆహారం పెట్టడం వంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఆచరించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, తమలపాకులు, ధూమపానం, మత్తు పదార్థాలను తీసుకోవడం నిషేధం.

తెల్లవారుజామునే స్నానం చేసి వస్త్రాలు శుభ్రపరుచుకుని క్రమం తప్పకుండా నుదుట చందనం రాసుకోవాలి. ధ్యానం చేయడం, అయ్యప్ప కీర్తనలు పాడటం, భజనలో పాల్గొనడం చేయాలి. ఈ 41 రోజులు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం వంటి పనులు చేయకూడదు.

అలాగే భక్తుడు ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ శారీరకంగానూ, మానసికంగానూ మాటలతో ఎదుటివారిని బాధించకూడదు. అలాగే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వంటి పనులు చేయకూడదు.

దీక్ష చేపట్టిన 41 రోజులు పాదాలకు చెప్పులు లేకుండా నడవాలి. అలాగే నేలపై నిద్రించాలి. వాళ్ళు నిద్రించేటప్పుడు మెడలోని మాల నేలను తాకరాదు.

నలుపు రంగు దుస్తులు ధరించాలి. నలుపు శని దేవుడికి చిహ్నంగా భావిస్తారు. అది మాత్రమే కాకుండా అయ్యప్ప దీక్ష కార్తీకమాసం చలి రోజుల్లో వేసుకుంటారు. అందువల్ల శరీరానికి చల్లదనం లేకుండా వెచ్చదనం ఉండడం కోసం నలుపు రంగు దుస్తులు ధరిస్తారు.

మాల ధరించిన వ్యక్తి భగవంతుడితో సమానం అందువల్ల ఏకవచంతో సంభోదించకూడదు. స్వామి అని పిలవాలి. మాల ధరించిన సమయంలో ఎటువంటి దహన సంస్కార కార్యక్రమాలకు హాజరు కాకూడదు.

ఒకవేళ ఇంట్లో వాళ్ళు రక్తసంబంధీకులు ఎవరైనా మరణిస్తే మాలను విసర్జించాలి. తల్లిదండ్రులు ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు మాలధారణ చేసుకోకూడదు. అలాగే భార్య మరణిస్తే 6 నెలల వరకు అయ్యప్ప దీక్ష చేపట్టకూడదు.

అయ్యప్ప మాల ధరించిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మాల ధరించిన స్వామిని ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరు ఈ దీక్ష విరమించే వరకు తాకరాదు. కచ్చితంగా స్వామి అని సంబోధిస్తూ గౌరవిస్తూ మాట్లాడాలి.

అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి దుస్తులు, వస్తువులు ఏవి ముట్టుకోకూడదు. స్వామికి సంబంధించి వస్తువులన్నీ వేరుగా ఉండాలి.

Whats_app_banner