Sabarimala 18 steps meaning: అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏంటి?ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?-the religious significance of the 18 steps at sabarimala temple ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sabarimala 18 Steps Meaning: అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏంటి?ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?

Sabarimala 18 steps meaning: అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏంటి?ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?

Himabindu Ponnaganti HT Telugu
Sep 23, 2024 04:40 PM IST

Sabarimala 18 steps meaning: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లకు విశిష్టత ఉంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంపడి’ అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియ‌మ నిష్ఠలతో క‌ఠోర దీక్ష చేప‌ట్టి ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది.

<p>శబరిమల అయ్యప్ప ఆలయం</p>
శబరిమల అయ్యప్ప ఆలయం

నవంబర్‌, డిసెంబర్‌, జనవరి ఈ మూడు నెలలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎంతో కఠోర నియమాలతో అయ్యప్ప దీక్ష చేపడతారు. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో చేసే దీక్ష చేస్తారు. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలై 18 కొండలు, 18 మెట్లపై అధిష్టించి కూర్చున్న మణికంఠుని దర్శించుకుంటారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధార‌ణ‌తో ప్రత్యేక పూజ‌లు చేస్తుంటారు. అంతేకాకుండా ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాల్లో శబరిమల ఒకటి.

41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులు ఎన్నో వ్యయప్రయాసలతో.. ఇరుముడి ధ‌రించి 18 కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుని శ‌బ‌రిగిరీషున్ని ద‌ర్శించుకుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంపడి’ అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియ‌మ నిష్టల‌తో క‌ఠోర దీక్ష చేప‌ట్టిన ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

ఒక్కో మెట్టు.. ఒక్కో విశిష్టత:

స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రతి అయ్యప్ప భక్తుడు 18 మెట్లను ఎక్కాల్సిందే. వీటిని గ్రానైట్‌తో నిర్మించారు. అంతేకాకుండా వాటికి పంచ లోహాలతో పూత పూశారు. తొలుత కుడి కాలు పెట్టి స్వామివారి 18 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది.

► స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.

► తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది.

► తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి.

► ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య.. అంటే అజ్ఞానంను సూచిస్తాయి. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తి భావంతో, గౌరవంతో ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తులు విశ్వసిస్తారు.  మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామి వారిని చూస్తూ కిందకు దిగివస్తారు.

18 మెట్లకు సంబంధించి ప్రాచుర్యంలో మ‌రో క‌థ :

ఈ 18 మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చక ముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది.

18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని అంటారు. అంతేకాకుండా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుందని చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం