Ganga pushkaralu 2024: గంగా నది పుష్కరాలు ఎప్పుడు? ఈ పుష్కర స్నాన ఫలితం పొందటం ఎలా?
25 April 2024, 11:13 IST
- Ganga pushkaralu 2024: గంగా నది అంత్య పుష్కరాలు అంటే ఏంటి? ఎప్పటి నుంచి మొదలవుతాయి. గంగానది పుష్కర స్నానం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
గంగానది అంత్య పుష్కరాలు
Ganga pushkaralu: పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. మనకు పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పుష్కరం అంటే పుష పుష్టో అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినది పుష్కరం. పుష్కరం అంటే పోషించేటటువంటిది అని ఒక అర్ధము. పుష్కరస్నానం పుణ్యార్చన చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి తనను తానుగా పోషించుకోవడానికి ఉద్ధరించుకోవడానికి సంబంధించినటువంటిది. ఎవరైతే పుష్కర సమయంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, తపాదులు వంటివి ఆచరించినటువంటివారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
గంగానది పుష్కర స్నానం ఫలితాలు
పుష్కర స్నానం చేయడం వల్ల వారు తెలిసిగాని, తెలియక గాని చేసినటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో ఆ పాపాలు కొంతవరకు పరిహారమవుతాయి. పుణ్యాన్ని సంపాదించుకోవడం వలన పుణ్య మార్గంలో మానవుడు సంచరించడం చేత అతనిలో ఉన్నటువంటి కామ, క్రోధ , మోహ, మద మాత్స్యర్యములు అనేటువంటి నశించి భక్తిమార్గం పెంపొంది ఆ భక్తిమార్గంలో వెళ్ళేటటువంటి వారికి మోక్ష సాధనలో ఉపయోపడుతుందని శాస్త్రం తెలియచేస్తుంది.
పుష్కర పుణ్య నదీ స్నానాలు, పుష్కర దానాలు, కర్మలు వంటివి శాస్త్ర సమ్మతంగా ఆచరించినట్లయితే వారికి పుష్కరాలు శుభఫలితాలు ఇవ్వడమే కాకుండా అక్కడ చేసేటటువంటి పితృ కర్మలు వలన పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.
ఏప్రిల్ మాసంలో ఆఖరి వారం ఏదైతే ఉన్నదో విశేషంగా మే 1వ తేదీ బృహస్పతి మేష రాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళడం చేత ఏప్రిల్ 19వ తారీఖు నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు అంటే ఈ ఆఖరి 12 రోజులు గంగానదికి అంత్య పుష్కరాలు ఏర్పడుతున్నాయి. బృహస్పతి మేషరాశిలో ఉంటే గంగానదికి ఆ సంవత్సరంలో పుష్కరాలు ఏర్పడతాయని శాస్త్రాలు తెలియచేశాయి.
చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 2024 మే 1 బృహస్పతి మేషరాశిలోకి వెళ్ళడంచేత మనకు ఏప్రిల్ 19 నుండి 30 వరకు ఉన్న ఈ పన్నెండు రోజులు గంగానదికి అంత్య పుష్కరాలు జరుగుతాయి. గంగానది పుష్కర స్నానం ఎవరైనా ఆచరించకపోయినా ఒక సంవత్సరంలో మొత్తంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు గంగానదిలో స్నానం ఆచరించినట్లయితే వారికి గంగానది పుష్కర స్నాన ఫలితం కనిపిస్తుంది.
గంగానది పుష్కర స్నానం ఎక్కడ చేయాలి?
అలా సంవత్సరం మొత్తంలో కూడా చేయలేనటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఈ ఆఖరి పన్నెండు రోజులలో చేసే స్నానం అత్యంత పవిత్రమైనదని చిలకమర్తి తెలిపారు. గంగానది పుష్కర స్నానం ఆచరించడానికి గంగ పుట్టినటువంటి గంగోత్రి చాలా ఉత్తమమైన ప్రదేశం.
గంగోత్రి తరువాత దేవ ప్రయాగలో స్నానమాచరించడం చాలా విశేషము. గంగోత్రి, దేవప్రయాగ వెళ్ళలేనటువంటి వారికి రుషీకేశ్, హరిద్వార్ వంటి క్షేత్రాలు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఈ ప్రదేశాలు కూడా గంగానదీ స్నానమాచరించడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశాలు. ఇవి కూడా కుదరలేనటువంటి వారికి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్డ్‌ఘాట్ వంటి క్షేత్రాలు, ఇది కూడా కుదరలేనటువంటివారు త్రివేణి సంగమంతో ఉన్నటువంటి ప్రయాగ గంగానది పుష్కర స్నానం చేయడానికి చాలా ఉత్తమమైన ప్రదేశం.
ఇదీ కూడా చేయలేనటువంటివారు గంగానది అంత్య పుష్కర స్నానం ఆచరించడానికి కాశీ క్షేత్రం చాలా ఉత్తమమైనటువంటి ప్రదేశం. ఉత్తర దిక్కుగా గంగానది తన గతిని మార్చుకుని ప్రవహించేటటువంటి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైనటువంటి ఆ శివుని నివాస క్షేత్రమైనటువంటి వారణాశి కాశీ క్షేత్రంలో చేయవచ్చు. వరుణ, హస్త నది సంగమంతో ప్రవహించేటటువంటి ఈ క్షేత్రంలో గంగానది పుష్కర స్నానం చేయడానికి చాలా ఉత్తమమైన ప్రదేశం.
సరస్వతీ నదిలో ఏడు రోజులలో కనీసం మూడు రోజులు సంకల్ప సహితంగా స్నానం ఆచరించినవారికి సరస్వతిదేవి అనుగ్రహం వలన వారి పాపాలు నశిస్తాయి. ఏ ఇతర నదులలో అయినా ఏడు రోజులు ఉన్నట్లయితే ఆ ఏడు రోజులు స్నానమాచరించినట్లయితే ఆ నది పుణ్యఫలం చేత వారికి సత్ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
పుష్కర స్నానం ఎలా ఆచరించాలి?
ఏ నదికి అయితే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించాలి. సబ్బులు, షాంపులతో స్నానం ఆచరించరాదు. నదులను కలుషితం చేసేటువంటి పనులు చేయరాదు. పుష్కర స్నానాన్ని శాస్త్రబద్ధంగా, విధివిధానంగా ఆచరించాలి. పుష్కర స్నానం ఆచరించేవారు ముందుగా వారి ఇంటివద్దే తలస్నానం ఆచరించాలి.
మూడు మునకలతో పుష్కర నదీ స్నానాన్ని ఆచరించాలి. ఈవిధంగా పుష్కరస్నానం ఎవరైతే ఆచరిస్తారో వారికి పుష్కర స్నాన పుణ్యఫలం లభిస్తుంది. స్నానం ఆచరించిన తరువాత దేవతలకు, రుషులకు తర్పణాలు వంటివి వదలటం చాలా మంచిది. గతించిన పితృదేవతలు ఉంటే వారికి కూడా తర్పణాలు వదలాలి.
శివుడిని, నారాయణుడిని అష్టాక్షరీ, పంచాక్షరీ మంత్రాలతో పఠించుకోవాలి. ఏ నదికి పుష్మరమైతే ఆ నదీమాతను తలచుకుని స్నానమాచరించాలి. పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్యమైన అంశాలలో ప్రప్రథమంగా సంకల్ప సహిత స్నానం. సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో పుష్కరాలలో పుణ్యనదీ స్నానాన్ని ఆచరించాలి. పుష్కర తర్పణాలను వదలాలి. పుష్కరాలలో గోదానం, భూదానం, సువర్ణదానం ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి షోడశ దానాలు వంటి ఎలాంటి దానాన్ని అయినా చేస్తే చాలా విశేషమైనటువంటి దానం. తరువాత జపాలు, తపాలు ఆచరించడం కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.