Maha shivaratri 2024: శివరాత్రి రోజు శివుడిని ఎలా పూజించాలి? జాగరణ ఎలా చేయాలి?
Maha shivaratri 2024: మహా శివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలి? ఏయే వస్తువులు పూజలో ఉపయోగించాలి అనే వాటి గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Maha shivaratri 2024: మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. సృష్టి ప్రారంభంలో ఈ రోజు మధ్య రాత్రివేళ శంకర భగవానుడు బ్రహ్మ నుంచి రుద్ర రూపంలో అవతరించాడని చెబుతారు. ప్రళభయవేళ ప్రదోష సమయాన శివుడు తాండవం చేస్తూ మూడవ నేత్ర జ్వాలలో బ్రహ్మాండాన్ని సమాప్తి చేస్తాడు. దీనినే మహా శివరాత్రి, కాళరాత్రి అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
త్రిలోక సుందరి, శీలవతి ప్రధానం గౌరిని అర్ధాంగిని చేసుకున్న శివుడు ప్రేత పిశాచాల మధ్య ఉంటాడు. స్వామి రూపం విచిత్రంగా ఉంటుంది. శరీరంపై శ్మశాన భస్మం, మెడలో సర్పాల హారాలు, కంఠంలో విషం, జటలో గంగను స్వీకరించిన శివుడు తన భక్తులకు శుభాలు కల్పిస్తాడు. సిరిసంపదలు ప్రసాదిస్తాడు.
కాలునికి కాలుడు, దేవతలకు దేవుడు, మహాదేవుడు అయిన శివుని వ్రతం విశేష మహత్వం కలది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీ, పురుషులు, బాలురు, వృద్ధులు ఎవరైనా ఆచరించవచ్చునని చిలకమర్తి తెలియచేశారు.
శివరాత్రి పూజా విధానం
ఈ రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానాదులు ముగించుకుని వ్రతం చేయాలి. పత్రాలు, పుష్పాలతో అందమైన వస్త్రాలతో మండపం తయారుచేసి సర్వతోభద్ర వేదికపై కలశ స్థాపన చేసి, గౌరీశంకరుల సర్వమూర్తులను, వెండి నందిని స్థాపించాలి. బంగారంతో శివలింగం చేయలేకపోతే మట్టితోనైనా శివలింగం తయారు చేయాలి.
కలశాన్ని నీటితో నింపాలి. కుంకుమ, బియ్యం, తమలపాకులు, వక్కలు, లవంగాలు, ఏలకులు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, తామరగింజల మాల, జిల్లేడు, బిల్వపత్రం, శివునికి అర్పించి పూజ చేయాలి. రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయడం గానీ, బ్రాహ్మణుల చేత శివస్తుతి చేయించి వినడం గాని చేయాలని చిలకమర్తి తెలిపారు.
జాగరణలో శివునికి నాలుగుసార్లు హారతి ఇవ్వడం అత్యంత అవసరం. శివపురాణం పారాయణం చేయాలి. మరుసటిరోజు జొన్నలు, నువ్వులు, పరమాన్నం, బిల్వపత్రాలతో హెరీమం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మనఃపూర్వకంగా, విధివిధానంగా ఈ వ్రతం ఎవరు చేస్తారో వారికి శివుడు అపార సంపదలు ఇస్తాడు.
శంకరునికి అర్పించిన నైవేద్యం తినడం నిషిద్ధం. ఈ నైవేద్యం తిన్నవారు నర బాధలు అనుభవిస్తారు. ఈ కష్ట నివారణకై శివరూపం వద్ద సాలగ్రామం పెట్టడం అనివార్యం. శివ మూర్తి దగ్గర సాలగ్రామం పెడితే నైవేద్యం తినడంలో తప్పు లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.