Shiva Lingam: రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం.. ఎక్కడ ఉందో తెలుసా?
ఉమర్‌కోట్ శివ్ మందిర్‌లోని శివ లింగం దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ మందిరం విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే పాకిస్తాన్ దేశంలో ఒక ప్రాంతం మాత్రం అన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచింది. కులమతాలకి అతీతంగా అక్కడ ఉన్న ఆలయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఎక్కడ ఉందో తెలుసా..?
సింధ్ రాష్ట్రంలోని ఉమర్ కోట్. ఈ ప్రదేశం ఎప్పుడు శివనామ స్మరణతో మారుమోగుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో కొలువైన శివలింగం. దేశవిభజనకి ముందు సింధ్ రాష్ట్రం భారత్ లో ఉండేది. కానీ విభజన అనంతరం అది పాకిస్థాన్ లో భాగంగా మారిపోయింది. పాక్ లో ఎన్నో గురుద్వారాలు, దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన శివాలయం మాత్రం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉమర్ కోట్ ని అమర్ కోట్ గా పిలిచే వాళ్ళు. మొగల్ పాలకుడు అక్బర్ అమర్ కోట్ లోనే జన్మించారు.
ఏమిటి ఈ శివాలయం ప్రత్యేకత
ఇక్కడ ఉన్న శివలింగం నిత్యం పెరుగుతూ ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారం ఒకప్పుడు అక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు అక్కడికి పశువులని మేతకి తీసుకొచ్చేవారు. కొన్ని ఆవులు అక్కడ ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి పాలు ఇస్తూ ఉండేవి. ఒకరోజు పశువుల కాపరికి అనుమానం వచ్చి వెళ్ళి చూడగా అక్కడ శివలింగం కనిపించింది. అతను వెంటనే ఊరి జనాలకు వెళ్ళి చెప్పడంతో పూజలు చేయడం మొదలు పెట్టారు.
ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. దీంతో అక్కడ శివాలయం ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని ఒక ముస్లిం వ్యక్తి కట్టించడం విశేషం. ఈ శివలింగం ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా పేరు గాంచింది. శివలింగం ఎలా ఉండేదో స్థానికులు అక్కడ ఒక మార్క్ పెట్టారంట. కొన్ని రోజుల తర్వాత శివలింగం గీత దాటి పెరగడం స్థానికులు గమనించారు. అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది.
శివరాత్రి పండుగ కోలాహలం
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి నాడు మూడు రోజుల పాటు భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటిని తిలకించేందుకు సింధ్ ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు వస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో పాల్గొంటారు. దాదాపు రెండున్నర లక్షల మంది వరకు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారట. ఈ ఉత్సవాల ఖర్చు మొత్తం ఉమర్ కోట్ లోని అల్ హిందూ పంచాయతీ భరిస్తుంది.
ఉమర్ కోట్ లో నివసించే ప్రజలు కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అక్కడ ముస్లిం, హిందువులు ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలిసి జీవిస్తారు.