Maha shivaratri 2024: ఆది గురువు, భోళా శంకరుడు, నీల కంఠుడు.. ఇలా ఒకటేమిటి శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు. నెలకి, ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు. ప్రతి నెల బహుళ చతుర్థశి నాడు మాస శివరాత్రి వస్తుంది. శివుడుకి కార్తీక మాసం అత్యంత ప్రీతి.
మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహా శివరాత్రి అంటే మరింత ప్రత్యేకం. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది.
శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం ప్రధాన విధులు. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడని పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహా శివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు.
శివ అంటే మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాస నాథుడు భోళా శంకరుడు మహా శివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహా శివరాత్రిగా పరిగణిస్తారు. మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.
శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయడం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే రోజు మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు వంటివి తినకూడదు. మద్యపానం సేవించకూడదు. నియమ నిష్టలతో శివుడి మీద మనసు లగ్నం చేసి శివ నామస్మరణలో లీనమైపోవాలి.
శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేయాలి. ఈరోజు శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం చాలా ముఖ్యం. ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వాలల శివానుగ్రహం పొందుతారు. విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా సరే పులకించిపోతాడు. అందుకే ఈరోజు తప్పనిసరిగా శివాభిషేకం చేయడం మరచిపోవద్దు.
ఇలా చేయడం వల్ల సకల సంపదలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. శివనామం, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహా మంత్రం జపించాలి. శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించి ప్రసాదం తీసుకుని ఉపవాసం వ్రతం విరమించాలి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. నాలుగు గంటలని ఒక్కో జాముగా భావించి శివుడికి పూజ చేస్తే ఉంటారు. అలా రాత్రి కూడా రావడం వల్ల నిద్రపోకుండా శివారాధన చేస్తారు. అందుకే శివరాత్రి రోజు తప్పనిసరిగాజాగారం చేస్తూ శివనామ స్మరణలో మునిగిపోతారు.