Maha shivaratri 2024: శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..-why lord shiva wear snake on his neck what is the reason behind it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2024: శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..

Maha shivaratri 2024: శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..

Gunti Soundarya HT Telugu
Feb 09, 2024 12:09 PM IST

Maha shivaratri 2024: పరమ శివుడి మెడలో ఎప్పుడూ పడగవిప్పిన పాము కనిపిస్తూ ఉంటుంది. సర్పం శివుడి మెడలో ఉండటం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది ఏంటో తెలుసా?

శివయ్య మెడలో పాము ఎందుకు ఉంటుంది
శివయ్య మెడలో పాము ఎందుకు ఉంటుంది (pixabay)

Maha shivaratri 2024: లయకారుడు సర్వాంతర్యామి అని శివుడిని పిలుస్తారు. ఎప్పుడు ధ్యాన ముద్రలో శివుడి కనిపిస్తాడు. శరీరం మీద పులి చర్మం కప్పుకుని, మెడలో పాముని కంఠాభరణంగా ధరించి, శరీరం అంతా విభూది ధరించి ఉంటాడు. అయితే శివుడు మెడలో పాము ఎందుకు ఉంటుందని సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే పరమాత్ముడు ధరించే ప్రతీ దాని వెనుక ఒక్కో అర్థం ఉంటుంది.

మెడలో పాము ఎందుకు ఉంటుందంటే..

ఈశ్వరుడు మెడలో ఉండే మహా సర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి వారి మెడలో ఉండి ఆయన్ని సేవిస్తూ తరిస్తాడు. వాసుకి శివుని మెడలో ఉండటం వెనుక ఒక చిన్న కథ ఉంటుంది.

కశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలలో వినత, కద్రువ ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనూరుడు సూర్యుని రథ సారథిగా ఉంటాడు. కద్రువకి వెయ్యి మంది సర్పాలు సంతానం. వాళ్ళలో ఆదిశేషువు పెద్దవాడు. పాల సముద్రంలో ఉన్న గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్పింది. అదెలాగా గుర్రం తోక తెల్లగా కదా ఉండేది నల్లగా ఉందని చెప్తావ్ ఏంటని వినత తన మాటలు నమ్మలేదు. ఈ విషయం గురించి ఇద్దరి మధ్య వాదన జరిగింది.

తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని.. ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ చెప్తుంది. పరిశీలిద్దామని వెళ్దామనుకునేసరికి చీకటి పడుతుంది. ఇప్పుడు కాదు పొద్దునే వచ్చి పరీక్షిద్దామని వెళ్లిపోతారు. కానీ వినతకి తెలియకుండా కద్రువ వచ్చి చూస్తుంది. గుర్రం తోక తెల్లగానే ఉండటంతో ఈ పందెంలో ఎలాగైనా తనే గెలవాలనే ఆశతో ఒక చెడు ఆలోచన చేస్తుంది. తన కుమారులని పిలిచి నల్లగా ఉన్న పాములన్నీ వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవాలని చెప్తుంది. కానీ తల్లి చెప్పిన మాటకు కొడుకులు ఒప్పుకోరు.

ఇది అధర్మ మార్గమని ఎంత చెప్పినా కూడా కద్రువ వినిపించుకోదు. తన మాట కాదని అన్నందుకు కొడుకులని శపిస్తుంది. భవిష్యత్ లో జరిగే సర్పయాగంలో పడి అందరూ చనిపోతారని శాపం విధిస్తుంది. దీంతో భయపడిపోయిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం వెళ్ళి గుర్రం తోకను చుట్టుకుంటారు. గుర్రం తోక తెల్లగా కాకుండా నల్లగా ఉందని వినతి నమ్ముతుంది. ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాసీగా చేస్తుంది. ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు.

ఆదిశేషువు అలా.. వాసుకి ఇలా

కద్రువు మాట అంగీకరించని ఆది శేషువు శాపానికి గురి కావడం వల్ల దాని నుంచి బయట పడేందుకు మహా విష్ణువు కోసం తపస్సు చేస్తాడు. తపస్సుకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యు భయం లేకుండా చేసేందుకు తన శేషతల్పంగా ఉండమని వరం ఇస్తాడు. ఇక రెండో కుమారుడు వాసుకి శివుడి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన మెడలో కంఠాభరణంగా ఉండమని చెప్తాడు. శివుడు మృత్యుంజయుడు. ఆయన దగ్గర ఉంటే వాసుకికి కూడా ఎలాంటి ప్రమాదం దరి చేరదు. అలా వాసుకి అప్పటి నుంచి శివుడి మెడలో ఉండిపోయాడు.

WhatsApp channel