Monday Motivation : కొన్నిసార్లు మంచి చేయడమే చెడు.. ఈ గుర్రం, మేక కథే ఎగ్జాంపుల్-monday motivation some times helping is bad for you heres horse and goat story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : కొన్నిసార్లు మంచి చేయడమే చెడు.. ఈ గుర్రం, మేక కథే ఎగ్జాంపుల్

Monday Motivation : కొన్నిసార్లు మంచి చేయడమే చెడు.. ఈ గుర్రం, మేక కథే ఎగ్జాంపుల్

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 05:00 AM IST

Monday Motivation : కొన్నిసార్లు ఏం చేయాలో కాదు.. ఏం చేయకూడదో కూడా తెలిసి ఉండాలి. అదే లౌక్యం. అప్పుడే జీవితంలో పైకి వస్తాం. ఇతరులకు మంచే చేయాలనుకుంటాం. కానీ మనకే అది రివర్స్ అవుతుంది. మనం బలైపోతాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఇతరులకు మంచి చేయడం అనే పద్ధతి ఉండాలి. కానీ కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా ఆలోచించాలి. లేదంటే.. అనవసరంగా మీరు బలైపోతారు. అవతలివారికి చేసిన మంచి మిమ్మల్ని చెడు రూపంలో ఇబ్బంది పెడుతుంది. దీనికి సంబధించి.. ఓ కథ కూడా ఉంది.

ఒక ఊరిలో ఓ సాధువు ఉండేవాడు. చాలా జాలి స్వభావం కలవాడు. ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన దగ్గర కొందరు శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులకు గురువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు సన్యాసి తన శిష్యులతో మాట్లాడుతుండగా.. గురువుగారూ మీకు ఇష్టమైన కథ ఏంటి? అని అడిగారు. గుర్రం, మేక కథ అని చెప్పాడు సాధువు. అవునా ఏంటి ఆ కథ అని అడిగారు శిష్యులు.

వారి కోరిక మేరకు గురువు కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక రైతు గుర్రం, మేకను పెంచుతున్నాడు. గుర్రానికి బెస్ట్ ఫ్రెండ్ మేక. ఒకరోజు గుర్రానికి వైరస్ సోకింది. ఆ రైతు వైద్యం చేయడానికి వైద్యుడిని తీసుకువచ్చాడు. డాక్టర్ పరిస్థితి చూశాడు. నేను వచ్చి మూడు రోజులు మందు ఇస్తాను అని చెప్పాడు డాక్టర్. అలా గుర్రం మందు తింటుంది. కానీ లేచి నడవదు. ఇక విసుగు చెందిన డాక్టర్.. ఇక దానిని చంపాలి లేదంటే.. ఇతర జంతువులకు వైరస్ సోకుతుంది అని చెబుతాడు.

మేక వారి సంభాషణ వింటోంది. మరుసటి రోజు మళ్లీ డాక్టర్ వచ్చి మందు ఇస్తాడు. నా గుర్రం లేచి నడిస్తే.. నీకు మంచి పార్టీ ఇస్తానని వైద్యుడితో రైతు చెబుతాడు. మేక గుర్రం దగ్గరకు వచ్చి, లేచి నడువు మిత్రమా, లేదంటే వారు నిన్ను చంపుతారు అని చెబుతుంది. గుర్రాన్ని ప్రోత్సహించింది. నువ్ చేయగలవ్ అని అంటుంది. దీంతో నడిచేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. చివరకు మెల్లమెల్లగా నడుస్తుంది.

అనుకోకుండా గుర్రాన్ని చూడ్డానికి వచ్చిన రైతు నడవడం చూసి సంతోషించి డాక్టర్‌ని పిలుస్తాడు. ఏం ఆశ్చర్యం.. నా గుర్రానికి నయమైంది. మీకు పార్టీ ఇవ్వాలని అంటాడు. గుర్రాన్ని నడవమని ప్రోత్సహించిన మేకనే కోసి.. విందు ఇస్తాడు.

సాధువు ఈ కథ చెప్పగానే అయ్యోపాపం అనుకుంటారు శిష్యులు. ఈ కథలో గుర్రానికి మేక వల్లే నయమైంది. అయితే ఆ గుర్రానికి వైద్యుల మందు వల్లనే నయమైందని భావించి మేకనే బలి ఇస్తాడు రైతు. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో ప్రయోజనం పొందిన వారి కంటే మంచి వారు బలి కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు సాయం చేయడం కూడా ప్రాణాలకు మీదకు వస్తుంది. ఎలాంటి పరిస్థితి ఎదురు అవుతుందని ఊహించుకుని సాయం చేయాలి.

Whats_app_banner