తొలి ఏకాదశిని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి?
28 June 2023, 11:26 IST
- తొలి ఏకాదశిని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. రేపు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుసుకోవల్సిన అంశాలు ఇక్కడ చూడండి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి
తొలి ఏకాదశినే శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని అంటారు. ఈరోజు నుంచే సూర్యడు దక్షిన దిశ వైపు ప్రయాణం ప్రారంభించనున్నందున దక్షిణాయన ప్రారంభ దినం అని కూడా అంటారు.
లేటెస్ట్ ఫోటోలు
విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి సంకల్పం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవిస్తుంది. ఆమె పేరు ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని ఆమె మూడు వరాలు కోరుతుంది. మొదటి కోరిక తాను విష్ణుమూర్తికి ప్రియమైనదానిగా ఉండాలి. రెండోది అన్ని తిథుల్లోకెల్లా ఏకాదశికి ప్రాధాన్యత ఉండాలి. మూడో వరంగా ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి భక్తితో శ్రీవిష్ణుమూర్తిని ఆరాధించేవారికి మోక్షం లభించాలి.. అని కోరుతుంది. విష్ణుమూర్తి ఆ వరాలను ప్రసాదిస్తాడు.
అలా ఏకాదశి తిథి రోజు ఉపవాస దీక్షను చేస్తూ విష్ణుమూర్తి సేవలో నిమగ్నమైన వారికి మోక్షం లభిస్తుంది. అయితే ఏకాదశి తిథి రోజు ఉపవాసం పేరుతో కేవలం ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే కాదు.. ఇందులోని ఆంతర్యాన్ని గుర్తించి దానిని మనం అలవరుచుకోవాలి.
మురాసురుడు రాక్షసుడు. దుర్మార్గుడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. మనలోని అసుర గుణాన్ని కూడా మనం సంహరించాలన్నదే ఈ ఏకాదశి వ్రతం ఉద్దేశం. మనలోని దుర్గుణాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను త్యజించడమే ఈ వ్రత లక్ష్యం కావాలి. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ దుర్గుణాలను వీడనప్పుడు మోక్షమార్గం లభించదని పెద్దలు చెబుతారు.
అలాగే ఉపవాసం ఉండే వారు పచనం (జీర్ణం) అయ్యే వస్తువుల గురించి ఆలోచనలను రానివ్వరాదు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం గురించి గానీ, మరుసటి రోజుకు ఆహారం సిద్ధం చేయడం గానీ, అలా చేయాలన్న ఆలోచన గానీ రానివ్వరాదు. హరినామ స్మరణలో ఆకలిని మరిచిపోవాలి.
రేపు తొలి ఏకాదశి పర్వదినమైనందున ఈరోజు రాత్రి నుంచే నియమాలను పాటించాలి. ఈరోజు రాత్రి అల్పాహారం తీసుకునే వారు తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం మాత్రం తప్పకపాటించాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం ముగించి విష్ణుమూర్తి సేవలో తరించాలి.
విష్ణుమూర్తికి దీపం వెలిగించి పూలు, పండ్లు సమర్పించాలి. నైవేద్యంలో తప్పనిసరిగా తులసీదళాలు సమర్పించాలి. విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. ఉపవాస దీక్షను కొనసాగించాలి.
మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానం ముగించి విష్ణుమూర్తికి పూజ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్ష ముగించాలి. మధుమేహం, బీపీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఉండరాదు. అలాగే 12 ఏళ్లలోపు వారు, 65 ఏళ్లు పైబడిన వారూ ఉపవాసం ఉండరాదు.
తొలి ఏకాధి రోజున విష్ణు మూర్తి నిద్రకు ఉపక్రమించి తిరిగి నాలుగు నెలల అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశికి మేల్కొంటారట. అందుకే దీనిని శయన ఏకాదశి, దేవశయని ఏకాదశిగా చెబుతారు.