ఏకాదశి వ్రతము అంటే ఏమిటి? ఏకాదశి వ్రతము ఎలా చేయాలి?
ఏకాదశి వ్రతము అంటే ఏమిటి? ఏకాదశి వ్రతము ఎలా చేయాలి? పంచాంకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కలియుగంలో మానవులు యజ్ఞ యాగాది కర్మలు ఆచరించలేని స్థితిని పొందుతారు కాబట్టి వారియొక్క కష్టములు తొలగి సుఖసౌఖ్యములు పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనటువంటి వ్రతముగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఏకాదశి వ్రతము గురించి వ్రత మహత్యము గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అరణ్యవాసములో చెప్పినట్లుగా మహాభారతము స్పష్టంగా చెప్పినది అని చిలకమర్తి తెలిపారు.
మన పూర్వీకులు సూచించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారం.
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)గా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నుండి శ్రీమహావిష్ణువు క్షీరాబ్టియందు శయనిస్తాడు. కనుక దీనిని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు ప్రత్యక్షదైవమైన సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది.
అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్షపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి అని చిలకమర్తి తెలిపారు.
మనకు పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమాసం ప్రకారం ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి బాగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాము. అష్టకష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినవారు సమస్త వ్యధల నుండి విముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం సూచించింది.
ఏకాదశి కథ
తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు తన సంకల్పము వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపచేశాడు. ఆమె పేరు ఏకాదశి. ఆమె శ్రీహరిని మూడు వరాలను కోరింది. 1. సదా మీకు ప్రియముగా ఉండాలి 2. అన్ని తిథులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి 3. నా తిథియందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణాలు చెప్పాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశినాడే మోక్షప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణం తెలిపింది. అందువల్లనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా శ్రీహరిని పూజించాలి. ఆరోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. ఆరోజు రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశినాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.