Chaitra masam 2024: చైత్ర మాసం ప్రాముఖ్యత ఏంటి? ఈ మాసం ఎందుకంత ప్రత్యేకం?
04 April 2024, 12:35 IST
- Chaitra masam 2024: తెలుగు సంవత్సరాలలో చైత్ర మాసం మొదటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర మాసానికి విశేష ప్రాముఖ్యత ఉంటుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
చైత్రమాసం ప్రాముఖ్యత ఏంటి?
భారతీయ సనాతన ధర్మంలో వేదములకు, వేదాంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. వేదాంగాలను మానవుడి శరీరంలో భాగాలుగా చెప్తారు. శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరూప్తం, కల్ప, జ్యోతిష్యం.. ఈ ఆరింటిని వేదాంగాలుగా చెప్తారు. అలాంటి వేదాంగాలలో జ్యోతిష్యాన్ని చక్షుహు అంటే శరీరంలోని కళ్ళతో పోల్చడం జరిగింది. అలాంటి జ్యోతిష్య శాస్త్రంతో ముడిపడి ఉన్న మాసం చైత్ర మాసం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల గణనం చాలా ముఖ్యమైనది. అలాంటి కాల గణనంలో సంవత్సరాలు మాసాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన మాసాలలో తొలి మాసం చైత్ర మాసం అని చిలకమర్తి తెలిపారు. బ్రహ్మ దేవుడు సృష్టిని ఆరంభించిన మాసం చైత్రమాసం. యుగమునకు ఆది ఉగాదితో ప్రారంభమైన మాసం చైత్రమాసమని చిలకమర్తి తెలిపారు.
కల్ప ఆరంభము యుగ ఆరంభము అయిన రోజు యుగాదిగా చెప్పబడింది. యుగాది రోజునే బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభించినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ జరుపుకొనున్నారు.
చిత్తా నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉండటం చేత ఏర్పడిన మాసం చైత్ర మాసం. వసంతోత్సవాలు, చైత్ర నవరాత్రులు వచ్చే మాసం చైత్ర మాసమని చిలకమర్తి తెలిపారు. చైత్ర మాస శుక్ల పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటారు. చైత్ర మాసంలో మొదటి తొమ్మిది రోజులు ఉత్తర భారతంలో విశేషంగా చైత్ర నవరాత్రులు చేస్తారు.
చైత్ర నవరాత్రులు ఎందుకు పాటిస్తారు?
ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి, శ్రద్దలతో కొలవడం కఠిక ఉపవాసాలు చేయడం విశేషం. పురాణాల ప్రకారం యమ ధర్మరాజు కోరలు సంవత్సరంలో రెండు పర్యాయాలు బయటకు ఉంటాయి. ఉత్తరాయణంలో చైత్రమాసం శుక్ల పక్ష పాడ్యమి నుంచి నవమి వరకు, దక్షిణాయణంలో ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి నుంచి నవమి వరకు ఇలా తొమ్మిది రోజులు యమధర్మ రాజు కోరలు బయటకి ఉంటాయి.
అందువల్ల విష జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయని ఈ సమయంలో పరిశుభ్రంగా ఉండి అమ్మవారి ఆరాధన చేసి ఆరోగ్య నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారాలు తీసుకుంటే అనారోగ్యం నుంచి బయట పడతారని భక్తుల విశ్వాసం.
అందువల్ల చైత్ర మాసం శుక్ల పక్ష పాడ్యమి నుంచి నవమి వరకు భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులు పాటించడం ప్రాధాన్యత అని చిలకమర్తి తెలిపారు. చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఆరోజు రామచంద్రమూర్తి భూమి మీద అవతరించిన రోజు, సీతమ్మతో వివాహం జరిగిన రోజు, రాముడి పట్టాభిషేకం జరిగిన రోజుగా రామాయణం తెలియజేసింది.
శ్రీరామనవమి రోజు విశేషంగా భక్తిశ్రద్దలతో రాముడిని పూజిస్తారని చిలకమర్తి తెలిపారు. చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడిని పూజించడం విశేషం. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ పౌర్ణమి వరకు హనుమాన్ దీక్షలు చేయడం విశేషం. చైత్ర మాస ఉగాది రోజు యుధీష్టరుడికి పట్టాభిషేకం జరిగిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. చైత్రమాసంలో విక్రమాదిత్యుడికి పట్టాభిషేకం జరిగినట్టు చిలకమర్తి తెలిపారు.
చైత్ర శుక్ల పౌర్ణమి నాడు హనుమంతుడి జననం జరిగినదని ఆరోజు హనుమంతుణ్ణి విశేషంగా షోడశోపచారాలతో పూజచేసి అప్పాలు నైవేద్యం పెట్టి హనుమంతుని కృప కోసం ప్రార్ధన చేస్తారు. ఇలా చైత్రమాసం అంతా విష్ణు సంబంధంగా, దుర్గాదేవి సంబంధంగా విశేషంగా భారతీయులు ఆచరిస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.