Potatoes: బంగాళాదుంపలంటే ఇష్టమా? ఈ అనారోగ్య సమస్యలు ఉంటే ఆలుగడ్డలను తినకూడదు
Potatoes: ఆలుగడ్డతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది బంగాళాదుంపలతో చేసే కూరలు వేపుళ్లను ఇష్టపడతారు. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలను తినకూడదు.
Potatoes: ఆలుగడ్డల ఫ్రై లేదా బంగాళదుంప వేపుడు ఎలా పిలిచినా ఈ వంటకం రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు బంగాళదుంపలతో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం. బంగాళదుంప వేపుడు, బంగాళదుంప టమాటో కూర, ఆలూ పలావ్... ఇవన్నీ కూడా ఎంతో మందికి ఇష్టం. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బంగాళదుంపలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆ అనారోగ్య సమస్యలు ఏవో ఒకసారి తెలుసుకోండి.
డయాబెటిస్ ఉంటే....
మధుమేహంతో బాధపడుతున్న వారు బంగాళదుంపలను దూరంగా పెట్టాలి. ఎందుకంటే వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వీటిని తిన్న వెంటనే గ్లూకోజ్ అధికంగా శరీరంలోకి విడుదలయిపోతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ వ్యాధి అధికమవుతుంది. కాబట్టి ఎవరైతే మధుమేహంతో బాధపడతారో వారు ఆలుగడ్డలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరీ తినాలనిపిస్తే వాటిని బాగా నీటిలో ఉడకబెట్టాక అప్పుడు వాటితో ఏదైనా వండుకోవాలి. అది కూడా తక్కువ మొత్తంలోనే తినాలి. నూనెలో డీప్ ఫ్రై చేసుకుని మాత్రం తినకూడదు.
గ్యాస్ట్రిక్ సమస్యలు
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఎవరైతే ఇలాంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడతారో అలాంటివారు బంగాళాదుంపల వంటకాలను దూరంగా ఉంచాలి. బంగాళదుంపలు పొట్టలో చేరాక గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. అలాంటివారికి గ్యాస్టిక్ సమస్యలు మరింతగా పెరిగిపోతాయి. కాబట్టి సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలను తినకూడదు.
ఊబకాయం
అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు... ఆలుగడ్డలతో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. ఆలుగడ్డలు తినడం వల్ల మరింతగా బరువు పెరుగుతారు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ఆలుగడ్డలను ఆహారంలో భాగం చేసుకోకూడదు. వీటిని తింటే మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు కూడా ఆలుగడ్డలకు దూరంగా ఉండడం ఉత్తమం.
హైబీపీ
ప్రపంచంలో హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. హై బీపీతో బాధపడుతున్న వారు బంగాళదుంపలకు దూరంగా ఉంటే మంచిది. బంగాళా దుంపలను అధికంగా తింటే అధిక రక్తపోటు సమస్య కూడా పెరిగిపోతుంది.
బంగాళాదుంపలను రాత్రి భోజనంలో తినకూడదు. ఇది ఎసిడిటీ సమస్యలను మరింత పెంచుతాయి. కడుపుబ్బరం కూడా రావచ్చు. పిల్లలకు కూడా రాత్రిపూట ఆలూ గడ్డ వంటకాలు పెట్టకపోవడం అన్ని విధాలా మేలు.
బంగాళాదుంపలను ఎవరైనా మితంగా తింటేనే మంచిది. అతిగా తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. కొంతమందికి బంగాళదుంపల వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వారంలో మూడు కన్నా ఎక్కువ సార్లు తింటే కొంతమందిలో ఈ ఎలర్జీలు కనిపిస్తాయి. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బంగాళదుంపలతో చేసిన వంటకాలు తక్కువగా తినడం ఉత్తమం. ఇది కీళ్ల నొప్పులను మరింతగా పెంచుతాయి.
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి సులువుగా బరువు పెరిగేలా చేస్తాయి. అలాగే మధుమేహాన్ని, రక్తపోటును పెంచేందుకు కూడా సహకరిస్తాయి. కాబట్టి బంగాళాదుంపలను అతి తక్కువగా తింటే ఆరోగ్యకరంగా ఉంటారు.
టాపిక్