Kakarakaya Karam Podi: కాకరకాయ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే, మధుమేహం ఉన్నవారు రోజూ తినొచ్చు
Kakarakaya Karam Podi: కాకరకాయలు మధుమేహలకు ఎంత తింటే అంత మంచిది. కాకరకాయ పొడిని చేసి పెట్టుకుంటే మధ్యాహ్న భోజనంలో రెండు ముద్దలు ఆ పొడితో తింటే మంచిది.
Kakarakaya Karam Podi: మధుమేహులకు కాకరకాయ చేసే మేలు ఇంత అంతా కాదు. అలాగని ప్రతిరోజూ కాకరకాయతో చేసిన వంటకాలు తినడం కష్టమే. కాబట్టి కాకరకాయ కారం పొడిని చేసి పెట్టుకోండి. ఇది రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో మొదట రెండు ముద్దలు కాకరకాయ కారంపొడితో తినండి. దీనివల్ల కాకరకాయలోని పోషకాలు శరీరంలో చేరుతాయి. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఈ కాకరకాయ కారంపొడిని ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఈ కాకరకాయ కారంపొడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు - నాలుగు
ఎండుమిర్చి - పది
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ధనియాలు - అర స్పూను
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజంత
మినప్పప్పు - ఒక స్పూను
శనగపప్పు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూన్
కాకరకాయ కారంపొడి రెసిపీ
1. కాకరకాయలను సన్నగా గుండ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఈ కాకరకాయలను ఆ నూనెలో వేసి వేయించాలి. మూత పెట్టకుండానే వేయించాలి.
4. అవి క్రిస్పీగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
5. మిగిలిన నూనెలో మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, చింతపండు వంటివి వేసుకొని వేయించుకోవాలి.
6. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి.
7. తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసి పొడి చేసుకోవాలి.
8. అంతే కాకరకాయ కారంపొడి రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
కాకరకాయలో ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాకరకాయ చేసిన వంటకాలు మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలను అడ్డుకుంటాయి. పచ్చకామెర్లు రాకుండా అడ్డుకుంటాయి. గుండె జబ్బులతో బాధపడేవారు కాకరకాయలు ప్రతిరోజూ తినడం చాలా అవసరం. అలాగే మధుమేహులకు కాకరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు.
కాకరకాయలో పాలీపెప్టైడ్ - పి అనే ఇన్సులిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మధుమేహ రోగులు ప్రతిరోజూ కాకరకాయ కారం పొడిని తినడం చాలా అవసరం. ఇందులో ఉండే ఫైబర్ పేగు కదలికలను పెంచుతుంది. కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ కాకరకాయ కారంపొడిని ఎక్కువ మొత్తంలో ఒకసారి చేసుకుంటే మీరు ఆరు నెలల పాటు దాన్ని వాడుకోవచ్చు.