Avise ginjala Kaaram Podi: అవిసె గింజలతో ఇలా కారం పొడి చేసుకొని చూడండి, వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది
Avise ginjala Kaaram Podi: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ వీటిని ఆహారంలో వాడే వారి సంఖ్య తక్కువ అవిస గింజలతో ఇలా కారంపొడి తయారు చేయండి రుచిగా

Flax Seeds Kaaram Podi: ఫ్లాక్స్‌సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు. వీటిని ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు సిఫారసు చేస్తూ ఉంటారు. అయినా వాటిని తినేవారి సంఖ్య చాలా తక్కువ. అవిసె గింజలతో చేసిన ఆహారాలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. అలాగే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అవిసె గింజలు తినడం వల్ల అజీర్తి సమస్యలు రావు.
మధుమేహంతో బాధపడేవారు అవిసె గింజలను కచ్చితంగా తినాలి. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో అది అదుపులో ఉంటుంది. కాబట్టి అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకసారి అవిసె గింజలతో కారంపొడిని ఇలా చేసుకుని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూను అవిసె గింజల కారంపొడి, అర స్పూను నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అదిరిపోతుంది.
అవిసె గింజలు కారంపొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
- అవిసె గింజలు - ఒక కప్పు
- జీలకర్ర - అర స్పూను
- చింతపండు - ఉసిరికాయ సైజులో
- ఎండుమిర్చి - 20
- కరివేపాకులు - గుప్పెడు
- మెంతులు - పావు స్పూను
- ధనియాలు - రెండు స్పూన్లు
- మినప్పప్పు - ఒక స్పూను
- శనగపప్పు - రెండు స్పూన్లు
- నూనె - రెండు స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి - ఎనిమిది రెబ్బలు
అవిసె గింజల కారం పొడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అవిసె గింజలను చిన్న మంటపై పావుగంట సేపు వేయించండి. వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోండి.
2. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు వేసి వేయించండి.
3. అన్నింటిని తీసి పక్కన పెట్టుకోండి.
4. అవి చల్లారాక మిక్సీ జార్లో అవిసె గింజలను వేయండి.
5. ఒకసారి మెత్తని పొడిలా చేసుకోండి.
6. అందులోనే ఈ ఎండుమిర్చిల మిశ్రమాన్ని కూడా వేసి మళ్లీ పొడి కొట్టండి.
7. ఇవి మెత్తగా అయ్యాక ఉప్పును కూడా వేసి మళ్లీ మిక్సీ పట్టుకోండి.
8. ఈ అవిసె గింజల కారంపొడిని తీసి ఏదైనా గాలి చొరబడని డబ్బాలో వేసుకోండి.
9. అంతే అవిసె గింజల కారంపొడి తయారైనట్టే.
10. దీన్ని మీరు అన్నంలోనే కాదు, ఇడ్లీ దోశ వంటి వాటితో తినొచ్చు. ఇది రుచిగా ఉంటుంది.
అవిసె గింజల కారం పొడి అన్ని రకాలుగా మీకు మేలు చేస్తుంది. ఎక్కువ కారాన్ని తట్టుకోలేని వారు ఎండుమిర్చిలను తగ్గించుకుంటే సరిపోతుంది. ప్రతిరోజూ అన్నం తినేముందు ఒక రెండు ముద్దలు ఈ అవిసె గింజల కారంపొడితో తినండి. అన్ని రకాల ఆరోగ్యం అందుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని ఈ కారం పొడిని తయారు చేయడం చాలా సులువు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి.