Diabetes: మధుమేహం అదుపులో ఉండాలంటే శాఖాహారులుగా మారండి
Diabetes: మధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. మధుమేహ రోగులు ఏం తింటే ఆరోగ్యమో చెబుతున్నారు పరిశోధకులు.
Diabetes: డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మారిన జీవనశైలి, తినే ఆహార పదార్థాలు, చెడు అలవాట్ల కారణంగానే మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో దాన్ని తట్టుకోవడానికి అంతే వేగంగా మనం మన పద్ధతులను మార్చుకోవాలి. లేకుంటే శరీరంలోని ప్రధాన అవయవాలను మధుమేహం దెబ్బతీస్తుంది. ఎలాంటి ఆహారం తినడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకోవడానికి అధ్యయనాలు జరుగుతున్నాయి. అలా ఒక తాజా అధ్యయనంలో శాఖాహారంగా మారితే మధుమేహం సమస్యలను తగ్గించుకోవచ్చని తేలింది.
ఏం తినాలి?
మాంసాహారానికి దూరంగా ఉంటూ కూరగాయలు, తాజా పండ్లు, పొట్టు తీయని ధాన్యాలతో వండిన ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. అలాంటి వారికి మధుమేహం ముప్పు వచ్చే అవకాశం 24 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనం చెప్పింది. అంతేకాదు మధుమేహం వచ్చినవారు కూడా ఇలా పూర్తి శాకాహారులుగా మారితే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా డయాబెటిస్ అదుపులో ఉంటుందని సాధారణ జీవితం గడపవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.
మాంసాహారానికి దూరంగా ఉంటూ శాఖాహారాన్ని తీసుకుంటే మధుమేహులకు కాలేయం, కిడ్నీ, జీవక్రియల పనితీరు మెరుగైనట్టు గుర్తించారు. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉండడమే కాదు ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు అవకాశాన్ని ఇస్తున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు.
అధిక బరువు, ఊబకాయం వంటివి మధుమేహం ముప్పును పెంచేస్తాయి. అలాగే వారసత్వంగా అంటే జన్యుపరంగా కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలు ఉన్నవారు కూడా శాకాహారులుగా మారితే వారిపై సానుకూల ప్రభావమే కనిపిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. అయితే పైన పొట్టు తీసిన ధాన్యాలు, తీపి పానీయాలు, స్వీట్లు, అన్నం వంటివి అధికంగా తినేవారిలో మాత్రం మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి పొట్టు తీసిన పప్పులు, ధాన్యాలను తినడం మాని, పొట్టు తీయకుండా ఉన్న వాటిని తినేందుకు ప్రయత్నించాలి.
మాంసాహారాలు అధికంగా తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ వంటి ప్రమాదకరమైన కొవ్వులు చేరుతాయి. అదే శాఖాహారుల్లో అయితే వారి రక్తంలో ఈ ట్రైగ్లిజరైడ్స్ వంటివి తక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులు, మధుమేహం వంటివి రాకుండా ఉంటాయి. వీలైనంతవరకు శాఖాహారానికే పరిమితం అవ్వడం చాలా ముఖ్యమని చెబుతోంది ఈ కొత్త అధ్యయనం.
శాఖాహారంపైనే ఆధారపడే వారికి మధుమేహం వచ్చే అవకాశం కూడా చాలా తగ్గిపోతుందని వివరిస్తున్నారు పరిశోధకులు. ఆహారంలో ఆకుపచ్చని ఆకుకూరలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి తిన్నాక పొట్ట ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంటుంది. కాబట్టి ఆకలి కూడా త్వరగా అయిపోయేది. రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. చిక్కుడు జాతికి చెందిన కాయ ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు వంటివి తరచూ తింటూ ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా, రక్తపోటు స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.
కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, రాజ్మా, పుట్నాల పప్పు వంటి తృణధాన్యాలను అధికంగా తింటూ ఉండాలి. వీటిలో ఫైబర్లు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే మంచి కొవ్వులు కూడా లభిస్తాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు.
బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ కుటుంబానికి చెందిన పండ్లు దొరికితే ఖచ్చితంగా తినండి. ఇవి మధుమేహ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ గా చెప్పుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్లు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. ప్రతిరోజు గుప్పెడు బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు బలాన్ని ఇస్తాయి. మధుమేహం వంటివి రాకుండా అడ్డుకుంటాయి.
టాపిక్