Sri Rama Navami 2024 Date: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? నవమి తిథికి ఉన్న విశిష్టత ఏంటి?
Sri rama navami 2024: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి? ఆరోజు వడపప్పు, పానకం ప్రసాదంగా ఎందుకు పెడతారో ఇక్కడ తెలుసుకోండి.
Sri rama navami 2024: ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడి వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఏకపత్నీ వ్రతుడు, అదర్శవంతుడుగా అందరికి ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. సకలభిరాముడు, సద్గుణాల రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకీ రాముడు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి. ధర్మానికి, నీతికి, మంచి మర్యాదలకు, నైతిక విలువలకు నిలువుటద్దం శ్రీరాముడు.
ఏటా చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.
శ్రీరామనవమి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఏప్రిల్ 16 మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటల నుంచి తిథి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.14 గంటలకు తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ఆధారంగా బుధవారం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటారు. పూజ చేసేందుకు 2 గంటల 35 నిమిషాలు శుభ ముహూర్తం ఉంది.
రవి యోగంలో రామనవమి
ఈ ఏడాది శ్రీరామనవమి రోజున రవి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రోజంతా ఉంటుంది. అలాగే ఉదయం 11:51 గంటల వరకు శూల్ యోగం, ఆ తర్వాత గండ యోగం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఉంటుంది. రవి యోగంలో సూర్యుడు చాలా బలమైన స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి.
శ్రీరామనవమి ప్రాముఖ్యత
లోక రక్షణ కోసం శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు. అలా త్రేతాయుగంలో మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు. దశరథ మహారాజు కౌసల్య దేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. అందువల్ల శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి చోట చలువ పందిళ్ళు వేసి శ్రీ రాముని ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
శ్రీరాముడికి అరటిపండు అంటే మహాప్రీతి అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో సీతారాములను పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. దాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా సేవిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. దోషాలన్నీ తొలగిపోతాయని జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని భావిస్తారు.
దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు. మానవుడు ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి? మాటకు ఎలా కట్టుబడాలి? తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారు.
తెలంగాణలోని భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ వేడుకను చూసేందుకు దూరప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారు. పెళ్లి కాని వాళ్ళు, వివాహంలో అడ్డంకులు ఏర్పడుతున్న వాళ్ళు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద వేసుకోవడం వల్ల వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు.
దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘాయువు లభిస్తుంది. ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురికాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిపి ప్రసాదంగా పంచిపెడతారు. ఇవి రెండూ తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు.
సంబంధిత కథనం