Banana Kheer: తీయని అరటిపండుతో పాయసం చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది
Banana Kheer: అరటిపండుతో చేసే తీయని వంటకం బనానా ఖీర్. దీన్ని త్వరగా వండేయచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని వండి చూడండి.
Banana Kheer: బనానా ఖీర్... దీన్ని అరటిపండుతో చేసే ఒక స్వీట్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే అరటి పండుతో దీన్ని వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లలకు దీన్ని తినిపిస్తే వెంటనే బలం అందుతుంది. ఈ అరటిపండు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
బనానా ఖీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు
అరటి పండ్లు - రెండు
పాలు - రెండు కప్పులు
యాలకుల పొడి - అర స్పూను
కుంకుమ పువ్వు రేకులు - రెండు రేకులు
బెల్లం తురుము - అరకప్పు
నట్స్ - గుప్పెడు
బనానా ఖీర్ రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు వేయాలి.
2. చిన్న మంట మీద ఆ పాలును వేడి చేయాలి. అవి కాస్త చిక్కబడే వరకు మరిగించాలి.
3. ఆ పాలల్లో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వు రేకులు వేసి మరగనివ్వాలి.
4. కుంకుమపువ్వు రేకుల వల్ల అది కాస్త రంగు మారుతుంది.
5. ఇప్పుడు అరటిపండును ఒక గిన్నెలో తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నా చాలు.
6. ఇప్పుడు మరుగుతున్న పాలలో బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి.
7. ఆ మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
8. ఇప్పుడు చేత్తో బాగా మెదుపుకున్న అరటిపండును ఈ పాలల్లో వేసి బాగా కలపాలి.
9. పైన నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి.
10. అంతే బనానా ఖీర్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది.
అరటి పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు అరటిపండుతో చేసిన ఆహారాల తింటే వెంటనే శక్తి అందుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే అరటిపండు వెంటనే నీరసాన్ని పోగొడుతుంది. అయితే మిగతా పండ్లతో పోలిస్తే అరటి పండులో షుగర్ లెవెల్స్ ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటి పండ్లతో చేసిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు. పిల్లలకు మాత్రం అరటి పండ్లు తినిపించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. వారికి శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. కాబట్టి కండరాలకు ఎంతో ఆరోగ్యకరం. అలాగే అధిక రక్తపోటును కూడా ఇది అదుపులో ఉంచుతుంది. పిల్లలకు ఒకసారి ఈ అరటిపండు పాయసాన్ని చేసి ఇవ్వండి, వారికి కచ్చితంగా నచ్చుతుంది.