చైత్రమాసం.. రాముడు, హనుమంతుడి కృప కోసం ప్రార్థించండి-chaitra masama 2023 significance in telugu by chilakamarti prabhakara sharma ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  చైత్రమాసం.. రాముడు, హనుమంతుడి కృప కోసం ప్రార్థించండి

చైత్రమాసం.. రాముడు, హనుమంతుడి కృప కోసం ప్రార్థించండి

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 11:01 AM IST

చైత్రమాసం.. తెలుగు సంవత్సరంలో తొలి మాసం. రాముడు, హనుమంతుడి కృప కోసం ప్రార్థించాలని చెబుతున్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

చైత్రమాసంలో ఉగాది, శ్రీరామ నవమి తదితర పర్వదినాలు వస్తాయి
చైత్రమాసంలో ఉగాది, శ్రీరామ నవమి తదితర పర్వదినాలు వస్తాయి

చైతమ్రాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసే రోజు కావున ఆ నెలకు చైత్ర మాసం అని పేరొచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చైత్ర మాసంతో వసంతఋతువు ప్రారంభం కావడం వలన చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూత పూయడం మొదలు పెడతాయి. చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రాత్రులు వసంతరాత్రాలుగా జరుపుకుంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి. చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి, చైత్ర పూర్ణిమ, చైత్ర బహుళ ఏకాదశి వరూధిని ఏకాదశి. ఉత్తర భారతంలో చాలాచోట్ల చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. 9 రోజులు ఉపవాసం ఉంటారు.

చైత్రమాసంలో తూర్పు ప్రాంతాలు పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో దుర్గాదేవిని విశేషంగా కొలుస్తారు. చైత్రమాసం విష్ణుమూర్తికి సంబంధించిన మాసంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్రమానంలోనే శ్రీరాముని యొక్క జననం జరగడం, శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణువు యొక్క అవతారం కావడం చైత్రమాసానికి అత్యంత ప్రాధాన్యత తెచ్చింది.

చైత్ర పౌర్ణమినాడు హనుమంతుని జననం జరిగినదని, చైత్రమాసం అంతా మహావిష్ణువునూ రాముడు, హనుమంతుణ్ణి పూజించడం చేస్తారు. చైత్రమాసంలో తొలిపండుగ ఉగాది. కలియుగ ఆరంభం చైత్ర శుక్ల పాడ్యమినాడు జరగడం వలన మనకి కలియుగంలో ఉగాది చైత్రమాసమునందే వస్తుంది. భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలలో ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర వంటి పెద్ద రాష్ట్రాలలో ఉగాదిని చైత్రమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమిగా వాల్మీకి రామాయణం తెలియచేస్తోంది. శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలం, ఒంటిమెట్ట వంటి క్షేత్రాలలో విశేషమైన వేడుకలు చైత్రమాసంలో జరుగుతాయి. చాలాచోట్ల రాముణ్ణి చైత్ర శుక్ల పాడ్యమినుండి చైత్ర పౌర్ణమి వరకు చైత్రమాసంలో పూజించడం చూడవచ్చు. చైత్ర శుక్ల నవమినాడు. చైత్ర పౌర్ణమినాడు శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరపడం విశేషంగా చైత్రమాసంలో చూడవచ్చు.

చైత్ర శుక్ల పౌర్ణమినాడు హనుమంతుడి జననం జరిగినదని ఆరోజు హనుమంతుణ్ణి విశేషంగా షోడశోపచారాలతో పూజ చేసి అప్పాలు నైవేద్యం పెట్టి హనుమంతుని యొక్క కృపకోసం ప్రార్థన చేస్తారు. ఇలా చైత్రమాసం అంతా విష్ణు సంబంధంగా మరియు దుర్గాదేవి సంబంధంగా విశేషంగా భారతీయులచే ఆచరింపబడుచున్నది.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్