Ugadi 2024: ఉగాదిపై సూర్య గ్రహణ ప్రభావం ఉంటుందా? అది శుభమా? అశుభమా?
Ugadi 2024: ఉగాది పండుగకు ఒక్కరోజు ముందు అతిపెద్ద సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఉగాది పండుగ మీద ఎలా ఉంటుందా? సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి చర్యలు పాటించాలో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Ugadi 2024: 8 ఏప్రిల్ 2024 ఫాల్గుణ మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అఖరి రోజు. అతిపెద్ద సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంతం గణితం ఆధారంగా రేవతి నక్షత్రం, మీనరాశిలో సూర్య గ్రహణం ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతకం వంటివి పాటించాల్సిన పనిలేదని చిలకమర్తి తెలిపారు.
భారతదేశంలో 8, 9 తేదీల్లో ఉగాది రోజున కూడా ఆలయాలన్నీ యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఈ సూర్య గ్రహణం భారతదేశంలో సంభవించదని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.
ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా దేశాలలో సంభవిస్తుంది.12 గంటల సేపు ఈ గ్రహణ ప్రభావం ఉంటుందని మధ్యాహ్నం 2 నుండి అర్థరాత్రి 2 గంటల మధ్య అనేక పశ్చిమదేశాలలో ఈ గ్రహణం కనబడుతుందని చిలకమర్తి తెలిపారు.
సూర్య గ్రహణ ప్రభావం
ఈ సంపూర్ణ సూర్య గ్రహణం రేవతి నక్షత్రం మీన రాశిలో ఏర్పడటం చేత మీనరాశిలో రవి, చంద్ర, శుక్ర, రాహువులు ఉండటం చేత ఇతర దేశాలలో ఉన్న మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. ఇతర దేశాలలో ఉన్నవారు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటివారు సూర్యగ్రహణం సమయంలో సూర్యారాధన ,దుర్గాదేవిని ఆరాధించడం, గ్రహణ శాంతులు వంటివి చేసుకోవడం వలన గ్రహదోషములు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
మీనరాశిలో గ్రహణం ఏర్పడటం వలన పశ్చిమ దేశాలకు అరిష్టాన్ని ఈ గ్రహణం సూచిస్తోంది. పశ్చిమదేశాలలో నివసించువారు అసహనాలకు లోనవడం, రాజకీయ అనిశ్చితి ఏర్పడటం, జనులమధ్య ఆవేశంతో గొడవలు కలగడం, యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు నెలకొంటాయని చిలకమర్తి తెలిపారు.
ఈ సూర్యగ్రహణం ప్రభావం వలన ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కలుగును. పశ్చిమ దేశాలలో ఆర్థిక సంక్షోభం వంటివి ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.