Somavathi amavasya: సోమవతి అమావాస్య రోజు సూర్య గ్రహణం.. ఈ పరిహారాలతో మీ బాధలన్నీ తొలగిపోతాయ్
Somavathi amavasya: సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. వీటితో పాటు ఆరోజు అరుదైన ఇంద్ర యోగం ఏర్పడుతుంది. ఆరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి.
Somavathi amavasya: సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య సోమవారం లేదా శనివారం వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది. ఏప్రిల్ నెలలో అమావాస్య 8వ తేదీ సోమవారం వచ్చింది. అందువల్ల దీన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు.
అమావాస్యతో పాటు ఏప్రిల్ 8న తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. సుమారు 54 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సూర్య గ్రహణం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో సూర్యుడు సుమారు ఏడున్నర నిమిషాల పాటు కనిపించడు. భారత కాలమానం ప్రకారం ఈ సూర్య గ్రహణం రాత్రివేళ ఏర్పడుతుంది. అదే సమయంలో అమావాస్య తిథి కూడా ఉంటుంది. ఏప్రిల్ 8వ తేదీ తెల్లవారు జామున 3.21గంటల నుంచి ప్రారంభమై అదే రోజు రాత్రి 11:50 గంటలకు ముగుస్తుంది.
సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి?
అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. నది స్నానం ఆచరించలేని వాళ్ళు గంగాజలం స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయొచ్చు. ఆ రోజు సూర్య దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. శివపార్వతులను ఆరాధించాలి. అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల గ్రహదోషాల నుంచి అనేక బాధల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇంద్ర యోగం
సోమవతి అమావాస్య రోజు అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆరోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్ర యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ యోగం సాయంత్రం 6.14 గంటల వరకు ఉంటుంది. అమావాస్య రోజు రాత్రి 11:50 గంటల సమయంలో శివపార్వతులు కలిసి ఉంటారని ఆ సమయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజు మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. ఎవరితోనూ దుర్భాషలాడకూడదు. ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.
సోమవతి అమావాస్య పరిహారాలు
సోమవతి అమావాస్య రోజు పచ్చిపాలను రావిచెట్టుకి సమర్పించాలి. అలాగే చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. తమలపాకులు, పసుపు తులసి మొక్కకు సమర్పించాలి. మధ్యాహ్నం సమయంలో నువ్వులు నీళ్లలో కలిపి దక్షిణం వైపు తిరిగి పూర్వీకులను స్మరించుకుంటూ ఆ నీటిని వదిలాలి. అలాగే ఆరోజు రావి చెట్టు కింద సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతోపాటు శివుని అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.
సోమవతి అమావాస్య రోజు పితృదేవులను స్మరించుకుంటూ రావి చెట్టుకి ఐదు రకాల స్వీట్లు సమర్పించాలి. తర్వాత చుట్టుపక్కల వారికి వాటిని పంచిపెట్టాలి. అలాగే ఆరోజు రావి మొక్కను ఎక్కడైనా నిర్మానుష ప్రదేశంలో నాటి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే జాతకంలో ఏర్పడిన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆరోజు ఐదుగురు బాలికలకు లేదా బ్రహ్మణులకు ఖీర్ పెట్టాలి.