Diya importance: ఇంట్లో సాయంత్రం కూడా దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఏంటి?
ఉదయం పూట మాత్రమే కాదు సూర్యాస్తమయం వేళలో కూడా దీపం వెలిగించాలని, అప్పుడే ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Diya importance: భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని శాస్తం. వేదాలలో మొదటి వేదమైనటువంటి రుగ్వేదం దానిలో మొదటి శ్లోకం అగ్ని దేవత ప్రార్ధనతో ప్రారంభమవుతుంది. అందుకనే భారతీయ సనాతన ధర్మంలో ప్రతీ కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. ఇటువంటి దీపాన్ని త్రి సంధ్యలు వెలిగించాలని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.
సనానత ధర్మాన్ని పాటించేటటువంటివారు దీపం లేకుండా ఎటువంటి దేవతారాధన చేయకూడదు. త్రి సంధ్యలు అనగా సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయం అలాగే అభిజిత్‌తో కూడియున్నటువంటి మధ్యాహ్న కాలము అలాగే సాయంత్రం ప్రదోషకాలముతో కూడియున్నటువంటి సంధ్యాసమయం మూడు సమయాలలో దీపారాధన చేయటం అత్యంత శుభమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సాయంకాల సమయంలో వెలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది. సూర్యాస్తమయానికి పూర్వమే ఇంటిని శుభ్రపరచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసికోట వద్ద మందిరములో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించేటటువంటి ఆచారములో భాగంగా సాయంత్రం దీపాలకు ప్రత్యేకత ఏర్పడిందని చిలకమర్తి తెలిపారు.
దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయే వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపచేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.