Holashtak 2024: హోలాష్టక్ సమయంలో ఇలా చేస్తే నవగ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోతాయి
Holashtak 2024: మార్చి 17 నుంచి 24వ తేదీ వరకు హోలాష్టక్ గా పరిగణిస్తారు. ఈ ఎనిమిది రోజులు శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైనవి కాదు. ఈ సమయంలో కేవలం పూజలు చేయడం వల్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.
Holashtak 2024: హోలీ పండుగ ముందు ఎనిమిది రోజులని హోలాష్టక్ గా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి 24 వరకు హోలాష్టక్ కొనసాగుతుంది. ఈ ఎనిమిది రోజులు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ కాలంలో అన్ని గ్రహాలు ప్రతికూల ప్రభావాలను ఇస్తాయి. అందువల్ల శుభకార్యాలు నిషేధిస్తారు.
నవ గ్రహాల దోషాలు, కష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు గ్రహాల అనుకూల ప్రభావాలు పొందేందుకు ఈ సమయంలో దేవతలను పూజించడం ఉత్తమంగా పరిగణిస్తారు. అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు వీలైనంతవరకు పూజలు చేయాలి. దైవ సన్నిధిలో ఎక్కువగా నిమగ్నమవాలి. హోలాష్టక్ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావాల నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయాలి. ఇలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
శివారాధన
ఈ సమయంలో శివుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగించడంలో సహాయపడుతుంది. చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. శివుని పూజించడం వల్ల తొమ్మిది గ్రహాలు శాంతిస్తాయి. హోలాష్టక్ సమయంలో “ఓం నమః శివాయ”, మహా మృత్యుంజయ మంత్రం పాటించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం కూడా మంచిది.
స్వస్తిక్ గీయాలి
మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టేందుకు స్వస్తిక్ చిహ్నం ఉపయోగపడుతుంది. మీ జీవితంలోని అడ్డంకులను ఇబ్బందులను తొలగించేందుకు మీ ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. పసుపు, బియ్యాన్ని మెత్తగా రుబ్బి అందులో గంగాజలం వేసి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ లేదా ఓం చిహ్నం వేయాలి. ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఈ గుర్తులు వేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి అనేది ప్రవేశించదు.
ధూపం వేయాలి
కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే హోలాష్టక్ ఎనిమిది రోజులు ఇంటి మొత్తానికి సాంబ్రాణితో ధూపం వేయాలి. అలాగే కర్పూరాన్ని ఆవు పేడలో కలిపి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లడం వల్ల ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఘర్షణ వాతావరణం తొలగిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతారు.
నరసింహ స్వామిని పూజించాలి
హోలీకి ముందు ఎనిమిది రోజులు నరసింహ స్వామిని పూజించే సంప్రదాయం ఉందని కొన్ని మత గ్రంథాలలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు, లోపాల నుండి బయటపడతారు. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించడం ఎక్కువగా చేయాలి. హోలాష్టక్ సమయంలో విష్ణు సహస్రనామం, కృష్ణాష్టకం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి. విష్ణువు దశావతారాలలో ఒకటి నరసింహావతారం. ఈ రూపంలోనే హిరణ్యకశపుడిని సంహరించారడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన పూజించడం వల్ల జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి చేయకూడదు
ఈ ఎనిమిది రోజులు శుభకార్యాలు నిర్వహించరు. ఈ సమయంలో గ్రహాల ప్రతికూల పరిస్థితిలో ఉండటం వల్ల ఏ పని తలపెట్టినా అందులో నష్టం, అపజయం ఎదురుచూడాల్సి వస్తుంది. అందుకే ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేయరు.