Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామం మహిమ ఏంటి? ఇది చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?-what is the majesty of vishnu sahasranama what are the results of reading this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామం మహిమ ఏంటి? ఇది చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామం మహిమ ఏంటి? ఇది చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 06:38 PM IST

Vishnu Sahasranamam: విష్ణు దేవుడిని స్మరించుకుంటూ, బాధలు తీర్చమయంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. అసలు ఈ స్తోత్రం మహిమ ఏంటి? దీన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

విష్ణు సహస్రనామ పారాయణం మహిమ
విష్ణు సహస్రనామ పారాయణం మహిమ

Vishnu Sahasranamam: రాజా! పరంజ్యోతి స్వరూపుడు, పరబ్రహ్మము, పవిత్రములను కూడా పవిత్రీకరించేవాడు విష్ణువు. శుభసంధాయకుడు, ప్రళయ కాలంలో ఈ భూతజాలమంతటినీ తన లోపల అణచి పెట్టుకొని ఉండేవాడు అయిన ఆ విష్ణుదేవుడి మంగళకరములైన సహస్రనామాలు జీవుల పాపాలను, భయాలను, పటాపంచలు గావిస్తాయి. గొప్ప సద్గుణముల కలయికచే ప్రసిద్ధిగాంచినవియూ, మంత్రవేత్తలైన మునిసంఘం చేత లెస్సగా కీర్తించారు. ఆ మహనీయుని సహస్ర నామాలను చతుర్విధ పురుషార్ధసిద్ధికై నీకు చెపుతాను భక్తి శ్రద్దలతో వినమని ఈవిధంగా భీష్ముడు ధర్మరాజుకి చెప్పుకొచ్చాడు.

“విశ్వంబు విష్ణుండు వషట్మారుండు భతభవ్యభవత్రభు”వనునవి మొదలైన రథాంగపాణి యక్షోభ్యుండు సర్వప్రహరణాయుధుండని యెడునివి తుదగా గల మహావిష్ణువు సహస్రనామాలు తెలియజెప్పి- ధర్మజా! కొనియాడదగినట్టి శ్రీమన్నారాయణుడి అప్రాకృతములైన నామాలు ఇవి. వీటిని నీ మేలును కోరి పరిపూర్ణంగా, క్రమక్రమంగా నీకు వినిపించాను. శ్రీమహా విష్ణువు యొక్క ఈ సహస్రనామాలు ప్రతిదినం ఇతరులు చదువగా ఆలకించిననూ, తాను చదివిననూ నరుడు ఈ లోకంలో, పై లోకంలో అశుభాల పాలుగాక కడలేని సౌఖ్యాలను అనుభవిస్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానం కలిగినవాడు ఈనామ సహస్ర పఠనం చేత ఉపనిషద్‌ రహస్యాలు తెలిసినవాడవుతాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అనేక బాధలు పడే వాళ్ళు సహస్రనామ పారాయణ చేయడం లేదా వినడం వంటివి చేస్తే ఆయా పాతకాలన్నీ నశించిపోతాయి. జనన మరణాలకూ, జరావ్యాధులకూ లోనుగాక పరమోత్తమమైన మోక్ష పదవిని అందుకొంటాడు. అంతేగాక పుణ్యాత్ములైన విష్ణు భక్తులకు ఇతరులొనర్చిన మేలు మరువకుండటం (కృతజ్ఞతాభావం), సుఖం, సహనం, సంపత్తి, ధైర్యం, యశస్సు అనేవి లభిస్తాయి. చెడు బుద్ధి, కోపం, పేరాశ, ఓర్వలేనితనం అనే దుర్గణాలు ఉండవు.

రాజా! సూర్యచంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశం, స్థావర జంగమాలతో చేరిన భూతలంబీ సముద్రాలు, దేవతలు, దానవులు, గంధర్వాదులుగా గలిగిన భూతజాలం శ్రీమహావిష్ణువుకి అధీనాలై మెలగుతున్నాయి. బుద్ధి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, శరీరం, శరీరగతులైన అత్మ ఈ పదార్థజాత మంతా వాసుదేవమయాలే! భూతాత్ముడు, మహాత్ముడయిన శ్రీమహావిష్ణువు ముల్లోకములందు వ్యాపించి లీలారహస్యాన్ని అనుభవిస్తున్నాడు.

సమస్త సన్మంగళాలను, సుఖాలను కోరుకొనే మానవుడు నిర్మలమైన చిత్తంతో అధికమైన భక్తితో శ్రీ వేదవ్యాస మహర్షిచేత రచించిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని తప్పక చదవాలి. ధర్మరాజా! విష్ణు దేవుడి సహస్రనామాలను ఎల్లప్పుడూ పఠించుము. అలా చేస్తే నీకు దీర్ఘాయువు, సంపద, వైభవం, ఆరోగ్యం లభిస్తాయి. శ్రీమహావిష్టు సహస్ర నామ మహిమను విన్న ధర్మరాజు భీష్మాచార్యుడికి సాష్టాంగ ప్రణామం చేసి వినయంతో సెలవు తీసుకొన్నాడని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel