అశ్వినీ దేవతలు ఎవరు? వైద్య శాస్త్రానికి అధిపతులా-know about ashwini devatha the devine healers ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అశ్వినీ దేవతలు ఎవరు? వైద్య శాస్త్రానికి అధిపతులా

అశ్వినీ దేవతలు ఎవరు? వైద్య శాస్త్రానికి అధిపతులా

HT Telugu Desk HT Telugu
May 10, 2023 02:21 PM IST

అశ్వినీ దేవతల గురించి తెలుసా? పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

అశ్వినీ దేవతలు
అశ్వినీ దేవతలు (RIG VEDA. Dhumavati. los diez mahavydas de la Mitologia Hindu, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

అశ్వినీ దేవతలు సూర్య పుత్రులు. వీరు కవలలు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మితమై ఉంది. ఆ రథాన్ని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.

చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.

ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలు వర్ణించాయి.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్