Muhurtham: మూఢం, ఖర్మలతో మూడు నెలల వరకు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు-kharma days start moodham in may june months no marriage muhurtams for 3 months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Muhurtham: మూఢం, ఖర్మలతో మూడు నెలల వరకు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు

Muhurtham: మూఢం, ఖర్మలతో మూడు నెలల వరకు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు

Gunti Soundarya HT Telugu
Mar 13, 2024 11:21 AM IST

Muhurtham: రేపటి నుంచి ఖర్మ రోజులు మొదలవుతాయి. దీంతో పాటు మూఢం కూడా ప్రారంభం కాబోతుంది. ఫలితంగా మూడు నెలల పాటు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు.

మూడు నెలలు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు
మూడు నెలలు పెళ్ళిళ్ళకు ముహూర్తాలు లేవు (pixabay)

Muhurtham: శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రేపటి నుంచి నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. మార్చి 14న సూర్యుడు మీన రాశి ప్రవేశం చేస్తాడు. దీంతో ఖర్మ రోజులు ప్రారంభం అవుతాయి. ఇవి నెల రోజులు ఉంటాయి. వీటితో పాటు మార్చి 17 నుంచి హోలాష్టక్ ప్రారంభమవుతుంది.

హోలీ పండుగకు ముందు వచ్చే హోలికా దహనంతో హోలాష్టక్ ముగుస్తుంది. హోలికా దహనం మార్చి 24న జరుపుకుంటారు. ఈ సమయంలో వివాహం మొదలైనవి నిర్వహించరు. ఇవి రెండు కలిసి రావడం వల్ల దాదాపు నెలరోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు లేవు. ఖర్మ రోజులు ఏప్రిల్ 13 వరకు ఉంటాయి. ఇవి ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో కేవలం 7 రోజులు మాత్రమే వివాహం చేసుకునేందుకు శుభముహూర్తాలు ఉన్నాయి.

ఏప్రిల్ 18, 20, 21, 22, 23, 25, 26 తేదీలలో మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి మూఢం ప్రారంభం అవుతుంది. ఇలా ఈ ఏడాది మూడు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించడానికి అనువుగా లేవు. మే, జూన్ నెలలో మూఢం ఉంటుంది.

మూఢం అంటే ఏంటి?

ఎక్కువగా మూఢం అనే పదాన్ని వింటూ ఉంటాం. ఈ సమయంలో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పెద్దలు చెబుతారు. అయితే మూఢం అంటే ఏమిటనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నవగ్రహాలు సూర్యుడు చుట్టూ సంచరిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. సూర్యుడు గురు, శుక్ర గ్రహాలతో కలిసినప్పుడు మూఢం ఏర్పడుతుంది.

ఏదైనా శుభ కార్యం నిర్వహించేందుకు గురు, శుక్రుడు శుభ స్థానంలో ఉండాలి. అప్పుడే చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. అందుకే గురు, శుక్ర గ్రహాలు శుభస్థానంలో ఉండాలని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. అయితే సూర్యుడు రాశి సంచారం చేసేటప్పుడు బృహస్పతి లేదా శుక్రుడుతో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహాల శక్తి క్షీణిస్తుంది.

గురు మూఢం

దేవగురువు బృహస్పతికి సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు గురు మూఢం ఏర్పడుతుంది. గురు గ్రహం ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తుంది. మే నెలలో సూర్యుడు మేష రాశి సంచారం చేస్తాడు. అటువంటి సమయంలో గురు గ్రహం శక్తి సన్నగిల్లుతుంది. ఈ సమయాన్ని గురు మూఢం అంటారు. గురు గ్రహం బలహీనపడుతుంది.

శుక్ర మూఢం

సూర్యుడు శుక్రుడుతో కలిసి సంయోగం చెందినప్పుడు శుక్ర మూఢం ఏర్పడుతుంది. సూర్యుడు మిగతా గ్రహాలతో సంయోగం చెందినప్పుడు ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ గురు శుక్రులతో సంయోగం చెందినప్పుడు మాత్రం వాటి ప్రభావం తగ్గిపోతుంది. ఫలితంగా మూఢం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేసేందుకు మంచిది కాదు. అలా చేయడం వల్ల కష్టం, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు.

శుక్రుడు సంపద, సంసార జీవితానికి, శృంగారం వంటి వాటికి కారకుడుగా భావిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తుతాయని, కాపురం సరిగా ఉండదని భావిస్తారు. అందువల్లే ఈ సమయంలో వివాహాలు చేయరు.

మూఢంలో ఏం చేయవచ్చు

అన్నప్రాసన, గృహానికి సంబంధించి ఏవైనా మరమ్మత్తులు ఉంటే చేసుకోవచ్చు. భూములు కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, అగ్రిమెంట్లు వంటివి నిర్వహించుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. అలాగే వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు.

మూఢంలో చేయకూడనివి

మూఢంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించకూడదు. లగ్నపత్రిక రాసుకోకూడదు. పెళ్లికి సంబంధించి ఎటువంటి చర్చలు జరపకూడదు. పుట్టు వెంట్రుకలు తీయకూడదు. గృహానికి శంకుస్థాపనలు నిర్వహించకూడదు. ఉపనయనం, వ్రతాలు, విగ్రహ ప్రతిష్టాపనలు వంటివి చేయరు. నూతన వ్యాపారాలు ప్రారంభించరు.

Whats_app_banner