Power of OM: ‘ఓం’ జపించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
Power of OM: మనసు, శరీరాన్ని ఏకం చేసే మంత్రం ఓంకారం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల దైవంతో మమేకం అవడమే కాదు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
Power of OM: విశ్వంలో ఉద్భవించిన మొదటి ధ్వని ఓంకారం. పవిత్రమైన చిహ్నం, ధ్వని మంత్రంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఈ ఓంకారం ఏర్పడింది. యోగా, ధ్యానం చేసేటప్పుడు ఓంకారం జపిస్తారు. మౌనంగా కూర్చుని భగవంతుడిని స్మరించుకుంటూ మంత్రాన్ని పఠిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక అభ్యాసాలలో ఓంకారం జపించడం ఒక భావం.
ఓంకారం జపించడం వల్ల మనసుకి, మెదడుకి గొప్ప శక్తి లభిస్తుంది. నిత్యం జపిస్తూ ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మొత్తం శరీరం, మనసు, ఆత్మని ఒక చోట చేర్చే సంపూర్ణ అనుభవం. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఓం జపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన, చంచలత్వం తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా ఓం జపించడం వల్ల స్వీయ అవగాహన, స్వీయ అంగీకారం, ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది.
ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఓం జపించాలంటే ఏకాగ్రత చాలా అవసరం. మనసు, శరీరాన్ని ఏకం చేస్తుంది. ఓంకారాన్ని పఠించడం వల్ల రోజువారీ జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. సమస్యలని ప్రభావవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఓం జపించడం వల్ల మనసుకి హాయినిస్తుంది. దైనందిన జీవితంలో నిత్యం ఒత్తిడితో మునిగిపోతుంది. దీని నుంచి బయట పడేందుకు రోజు మొత్తం మీద కనీసం కొద్ది నిమిషాలు ఓంకారం పఠించాలి.
నరాలని శాంతపరుస్తుంది. ఒత్తిడి హార్మోన్ల విడుదలని తగ్గిస్తుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఓం పఠించడం వల్ల వ్యక్తులు తమ భావోద్వేగాలని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోగలుగుతారు. మానసికంగా, శారీరకంగా ఉన్న సమస్యలు నివారిస్తుంది. నిద్రలేమి సమస్యని దూరం చేసి నిద్ర నాణ్యతని మెరుగుపరుస్తుంది. ఓం జపించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.
ఓం జపించడం వల్ల పొట్ట ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పొట్టలోని కండరాలు రిలాక్ అవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉద్రేకం అదుపులో ఉంచుకోగలితే సామర్థ్యం వస్తుంది.
ఓం జపించడానికి సరైన మార్గం
ఓం శబ్దం ఆధ్యాత్మికని సూచిస్తుంది. మీ అంతరాత్మతో మీరు కనెక్ట్ అవడానికి సహాయపడుతుంది. ఓం పఠనం దైవంతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఓం జపించే ముందు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి లోపల లేదంటే ఆరుబయట ప్రశాంతమైన స్థలం చూసుకోవాలి. సౌకర్యవంతంగా ఉండే విధంగా పద్మాసనం వేయాలి. చాప లేదా నేలపై కూర్చుని పద్మాసనం వేయాలి. మీ భంగిమ నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకోవాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఓం అని జపించడం వల్ల ఉదరం నుంచి గొంతు వరకు కంపనాలు ప్రతిధ్వనిస్తాయి.