Ugadi Pachadi: షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి? దీనికి ఎందుకంత ప్రాముఖ్యత?-what is significance of ugadi pachadi why its important to eat on ugadi festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Pachadi: షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి? దీనికి ఎందుకంత ప్రాముఖ్యత?

Ugadi Pachadi: షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి? దీనికి ఎందుకంత ప్రాముఖ్యత?

Gunti Soundarya HT Telugu
Apr 02, 2024 01:53 PM IST

Ugadi Pachadi: ఉగాది పచ్చడి లేకుండా పండుగ పూర్తి కాదు. అంతటి విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి మన జీవితంతో ముడి పడి ఉంటుంది. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంది. అదేంటో తెలుసుకుందాం.

ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి

కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనం ఇస్తాయి. కొత్త బట్టలు ధరించి అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది అనగా మొదటిగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు.

చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9న వచ్చింది. చాంద్రమానాన్ని అనుసరించి ఆ రోజున తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఉగాది నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి జరుపుకుంటారు. ఇది జీవితానికి సమృద్ధి శ్రేయస్సు ఆనందాన్ని తీసుకొస్తుంది. ఉగాది రోజు పొద్దున్నే నిద్ర లేచి స్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పచ్చి మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలతో తయారు చేసే ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. షడ్రుచులతో తయారు చేసిన ఈ పచ్చడి లేనిదే ఉగాది పండుగ పూర్తి కాదు.

ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది. సుఖ దుఃఖాలను, సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఆంతర్యం. ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలని సూచిస్తాయి. ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు.

ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. వాటిని ప్రతిబించేదే ఈ ఉగాది పచ్చడి. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. ఇది జీవితంలోని హెచ్చుతగ్గులను సూచిస్తుంది. కొత్త జీవితాన్ని, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ పలుకుతూ ఉగాది పచ్చడి తింటారు.

1. వేప పువ్వు

వసంత రుతువు రాగానే వేప చెట్లు అన్నీ పూతతో కళకళాడుతూ ఉంటాయి. ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వు ఉపయోగిస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. జీవితం పూల పాన్పు కాదు, సంతోషకరమైన ప్రయాణం కాదు. జీవితంలోని మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేరుస్తారు.

2. బెల్లం

ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి. ప్రతి సవాలను నవ్వుతూ స్వీకరించాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు అయినా సులభంగా అధిగమించగలుగుతారు. జీవితం సంతోషంతో నిండిపోతుంది. ఈ సంతోషాన్ని బెల్లం రుచి తీపిని సూచిస్తుంది.

3. మిరియాలు

ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేగాలలో కోపం ఒకటి. అయితే కొంతమందికి కోపం ఎలా నియంత్రించాలో తెలుసు. కానీ మరికొందరు తమ భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటారు. ఒక్కోసారి కోపం అనర్థాలను తీసుకొస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తూ, మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో మిరియాల పొడి కలుపుతారు.

4. ఉప్పు

ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు జీవితంలో వెనకబడిపోతారు. అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలి అనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. భయం పోగొట్టుకుని జీవితంలో ముందు సాగాలని తెలుపుతూ ఉప్పు వేస్తారు.

5. చింతపండు

పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు. ధైర్యంగా ఉంటే మీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతారు. అది మాత్రమే కాకుండా వాతావరణం మార్పుల వల్ల కొంతమంది జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది తీసుకుంటే కఫ బాధలు తొలగిపోతాయి.

6. పచ్చి మామిడికాయ

ఇక చివరిగా పచ్చి మామిడికాయ ఇది వగరుని సూచిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవితంలో ఆశ్చర్యకరమైన, కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెప్తూ మామిడి కాయ ఉపయోగిస్తారు.

సంబంధిత కథనం