Ugadi 2024: ఏటా చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగు వారి పండుగ ఉగాది. ఈ ఏడాది ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 నుంచి “క్రోధి నామ సంవత్సరం” ప్రారంభమవుతుంది. ఆ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. అప్పటి నుంచి చైత్రమాసం ప్రారంభం అవుతుంది. ఆరోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
యుగ, ఆది అనే రెండు పదాల నుంచి ఉగాది వచ్చింది. ఈ సమయంలో కాలంలో స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాదికి అందరూ సంతోషంగా స్వాగతం చెప్తారు. తెలుగు ప్రజలు ఈ పండుగను ‘ఉగాది’గా జరుపుకుంటే, మరాఠీలు ‘గుడి పడ్వా’గా జరుపుకుంటారు.
2024-2025 తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా పిలుస్తారు. క్రోధి అంటే కోపం కలిగించడమని అర్థం. తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తవుతాయి. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
శ్రీకృష్ణుడికి 16 వేల మంది భార్యలు ఉండగా వారిలో సందీపని అనే రాజకుమారికి 60 మంది పిల్లలు ఉన్నారు. వారి పేర్లు తెలుగు సంవత్సరాలుగా పెట్టారని చెబుతారు. అలాగే నారథుడి సంతానం పేర్లు కూడా వీరికి పెట్టారని మరొక కథ చెప్పుకొస్తారు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కూతురు పేర్లు కూడా ఇవే. చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.
గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంతో, కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉగాది వేడుక జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఉగాదితో కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఉగాది సంతోషం, శ్రేయస్సు, శాంతిని ఇస్తుందని ప్రజలను విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. విశ్వం సృష్టించిన మొదటి రోజే ఉగాది అని నమ్ముతారు.
ఉగాది నుంచి వసంత రుతువు ప్రారంభమవుతుంది. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదీ పుణ్యస్నానం ఆచరిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు.
ఇంట్లో పూజ చేసుకుని షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. జీవితంలోని ఎన్నో భావోద్వేగాలు, ఆటుపోట్లకు ఉగాది పచ్చడి సంకేతంగా పండితులు చెబుతారు. ఈరోజు చేసే ముఖ్యమైన పని సాయంత్రం పూట పంచాంగ శ్రవణం వినడం. ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘట్టం ఇది. కొత్త సంవత్సరం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు అందరూ తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు.
ఉగాది నాడు సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థానం ఏ విధంగా ఉంది? ఆదాయ, వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు.
పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బుద్ధిబలాన్ని, కేతువు అధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరుణ ఫలితాన్ని తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.
పూర్వకాలంలో కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతోంది? ఏ పంటలకు డిమాండ్ ఉండబోతోంది? ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు? ఖర్చులు ఎలా ఉంటాయి? వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారు. అలా ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.