మందపల్లి శనీశ్వరాలయం క్షేత్ర మహిమ తెలుసుకోండి
12 August 2023, 6:03 IST
- మందపల్లి శనీశ్వరాలయం క్షేత్ర మహిమ ఇక్కడ తెలుసుకోండి.
శనీశ్వరుడి క్షేత్రాల్లో మందపల్లి శనీశ్వర ఆలయం ప్రముఖమైనది.
ఈ మందపల్లి క్షేత్ర ప్రాంతమున పదునాలుగు వేల నూట ఎనిమిది పుణ్యతీర్థములు గలవు. వీటిలో ప్రధానమైనవి - అశ్వర్థ తీర్ధము, అగస్త్య తీర్ధము, సాత్రిక తీర్ధము, యాగ్నిక తీర్ధము, సానుగ తీర్ధము మొదలగునవి ముఖ్యమైనవని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
పూర్వకాలము నందు మేరు పర్వతముతో స్పర్థ వహించి అంతకంటే ఉన్నతముగా యుండవలయునని వింధ్యపర్వతము విపరీతముగా పెరగసాగెను. ఇట్లు వింధ్య పర్వతము మిక్కుటముగా పెరుగుచుండటచే భారత వర్షమున ఉత్తర దక్షిణ భాగములయందు సూర్యకిరణ ప్రసారము చక్కగా ప్రసరించదని ఆందోళన తలెత్తను. అంతట దేవతలు, బుషి పుంగవుడగు అగస్త్య భగవానుని వద్దకు వచ్చి వింధ్యపర్వతము యొక్క పెరుగుదలను నిలుపుటకై ప్రార్థించిరి. అగస్త్య మహర్షి వేయి మంది మహర్షులతో గూడి సూర్య గతిని నిరోధింప నిశ్చయించి మేరు పర్వతము నతిక్రమింప తలపెట్టిన అ వింధ్య పర్వతమునుచేరెను.
అంతట ఆ పర్వతరాజు బహు బుషిగణ సమేతుడగు అగస్త్య భగవానునికి సాష్టాంగ ప్రణామంబులు చేసి ఆర్హ్యృపాద్యాదులు నర్చించి అతిథి సత్మారంబులచే సంతుష్టుని చేసెను. అంత అగస్త్యముని పుంగవుడు అతిథి సత్యారంబులచే సంతుష్టాంతరంగుడై హే! పర్వత శ్రేష్టుడా నేను మహా జ్ఞానులగు మహర్షులతో గూడి దక్షిణ దిక్కునకు తీర్థయాత్రకై బయలుదేరితిని. నాకు మార్గము నిమ్ము. నేను తిరిగి ఉత్తర దిక్కునకు వచ్చే పర్యంతము నీవు పెరగకుండగా యిట్లే నుండవలెను. దీనికి భిన్నముగా చేయరాదు అని చెప్పగా ఆ పర్వత శ్రేష్టుడు సరేనని యట్లే నుండి పోయెను. అ బుషి సమూహముతో గూడుకొని అగస్త్య మహర్షి దక్షిణ దిక్కునకు వెడలెను. పిమ్మట క్రమముగా సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి సంవత్సరము సత్రయాగము చేయుటకు దీక్షితుడయెను.
అంతట ఆ సమయమున కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులు మహా పాపులునగు అశ్వత్థుడు, పిప్పలుడు యను యిరువురు రాక్షసులు దేవలోకములో కూడా ప్రసిద్ధి చెందినవారై యుండిరి. వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపములోను, పిప్పలుడు బ్రాహ్మణరూపములయుండి సమయమును జూసి యజ్ఞమును నాశన మొందించుటకై పాపబుద్ధిగలవారైరి.
రావిచెట్టు రూపములో నున్న అశ్వత్థుడు ఆ వృక్షభాయనాశ్రయించుటకు వచ్చిన బ్రాహ్మణులను దినుచుండెను. పిప్పలుడు, సామ వేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యగణంబులను భక్షించుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు మహర్షులు గౌతమీ దక్షిణ తటమున నియత వ్రతుడై తపమును నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూసి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి.
అప్పుడు ఆ శని బుషులతో నిట్లు పలికెను. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తికాగానే రాక్షసుల నిరువురిని వధించెదను అని పలికెను. అంతట మహర్షులు మేము మా తపః ఫలితమును నీకిచ్చెదము నీవు వెంటనే ఆ రాక్షసులను సంహరింపుమనిరి.
ఈ విధంగా బుషులచే చెప్పబడిన శని అట్లయిన రాక్షస సంహారము పూర్తి అయినట్లేనని బుషులతో పలికి బ్రాహ్మణ వేషమును దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వత్థుడు వద్దకు వెళ్ళి ప్రదక్షిణములు చేయనారంభించెను.
అంతట అశ్వత్థుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేసెను. ఆ పాపాత్ముడగు రాక్షసుడు సూర్యపుత్రుడగు శనిచే త్రెంచబడిన ప్రేగులు గలవాడై క్షణమాత్రములో మహా వజ్రాహతు వలె భస్మీభూతుడాయెను.
యిట్లు అశ్వత్థుడిని భస్మము గావించి బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము నభ్యసించుటకు వచ్చిన బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా వెళ్ళెను. అంతట పాప నిలయుడగు ఆ పిప్పలుడు ఈ సూర్యపుత్రుడిని అలవాటు ప్రకారముగా భక్షించెను. అంతట శని ఆ రాక్షసుని ప్రేవులు చూచినంత మాత్రమునే రాక్షసుడు భస్మమాయెను. ఆ ఇరువురు రాక్షసులను సంహరించిన శని యింకానేమి చేయవలయునని బుషులతో పలకగ ఆ మహర్షులందరు సంతుష్టాంతరంగులైరి. అగస్త్యాది మహర్షులందరు శనికి ఇవ్వవచ్చిన వరములనిచ్చిరి.
సంతుష్టుడై శని కూడ బ్రాహ్మణులతో నిట్లు పలికెను. నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్థవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు ఈడేరును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్ధము ఈ శనైశ్చర తీర్ధములలో ఎవరైతే స్నానము చేయుదురో వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా కొనసాగును.
శనివారము రోజున అశ్వత్థ ప్రదక్షిణములు చేసిన వారికి గ్రహపీడ కలుగదు. ఈ తీర్ధము నందు అశ్వత్థ తీర్ధము, పిష్పల తీర్థము, సానుగ తీర్ధము, అగస్త్య తీర్ధము, సాత్రిక తీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము మొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది బుషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెంది స్నాన జపపూజాదులను ఒనరించు భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సత్రయాగ ఫలము లభింపచేయుచున్నవని శాస్త్రములు చెప్పినట్లుగా చిలకమర్తి తెలిపారు.
సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు కరుణామయుడగు శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వార్మి సమస్త కోరికలు ఈడేరునట్లుగను, తన బాధ, యితర గ్రహపీడ మొదలైనవి లేకుండునట్లు గను శని వరములు నిచ్చెను. అంతట శనిచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నామాంతరము కలిగెను.
పిమ్మట ఈ మందేశ్వరునికి ప్రక్మనే సప్తమాత్రుకలు వచ్చి శ్రీ పార్వతీదేవిని ప్రతిష్టించిరి. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు.
ఈ ప్రక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమ మహర్షిచే ప్రతిష్టింపబడిన శ్రీ వేణుగోపాలస్వామి మూర్తి కలదు. మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారము నందు వరుసగా ఐదు దేవాలయములు కలిగి భక్త జనాహ్లాదకరముగా నుండును.
పూజాతత్చరులగు సమస్త భక్తులకు సమస్త కోరికలు నీరేడుటయే కాక అంత్యకాలము నందు మోక్షసామ్రాజ్యము నొందెదరని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మందపల్లి శనీశ్వర ఆలయం రాజమండ్రికి 38 కి.మీ. దూరంలో ఉంది. కాకినాడ నుంచి 60 కి.మీ. దూరంలో ఉంది. అమలాపురం నుంచి 30 కి.మీ. దూరంలో ఉంటుంది.