దశరథ ప్రోక్త శని స్తోత్రంతో శని బాధ నుంచి విముక్తి
దశరథ ప్రోక్త శని స్తోత్రం అను నిత్యం చదవడం వల్ల శనీశ్వరుడి ఆశీస్సులు లభించి ఈతి బాధలన్నీ తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవడం వల్ల శని అనుగ్రహం లభించడమే కాకుండా శని వల్ల ఎదురయ్యే ఈతి బాధలన్నీ తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
‘ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కర్మ ప్రదాత భూమి మీద శని భగవానుడే. శని భగవానుడు జాతకంలో ఏలినాటి శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, అష్టమ శని రూపంలో ఏ వ్యక్తికైనా గోచార పరంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి జాతక బలాన్ని బట్టి, ఆ వ్యక్తి ఆచరించే కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. శని మహర్దశ, శని అంతర్దశ ఉన్న వారికి కూడా శని ప్రభావం చేత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఏర్పడవచ్చు. జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే, శని భగవానుడిని పూజిస్తూ, అర్చిస్తూ, ఆరాధిస్తూ ఉంటే శని స్తోత్రాలు వంటివి చదువకుంటూ ఉంటే అటువంటి వారికి శని భగవానుడు మంచే చేస్తాడు..’ అని చిలకమర్తి తెలిపారు.
‘శని ప్రభావం చేత కూడా చాలా మంది జీవితంలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు పొందారు. అయితే ఎలాంటి వ్యక్తికైనా శని యొక్క ఈతి బాధలు తొలగి శని అనుగ్రహం కలిగి, శుభ ఫలితాలు పొందాలంటే వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కచ్చితంగా చదువుకోవాలి..’ అని చిలకమర్తి సూచించారు.
దశరథ ప్రోక్త శని స్తోత్రం వెనక కథ
పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో దశరథ మహారాజు ఈ భూమిని పరిపాలించేటప్పుడు శని ప్రభావం చేత అనావృష్టి, దుర్భిక్షం కలగబోతోందని తన ఆస్థాన జ్యోతిష్కులు, పండితుల ద్వారా తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆ శని భగవానుడిపై యుద్ధం చేసి ఆ ప్రభావం తొలగిచుకుందామని యుద్ధానికి బయలుదేరి వెళతాడు.
యుద్ధానికి వస్తున్న దశరథుడిని చూసి, ఆ ధైర్య సాహసాలు చూసి శని భగవానుడు సంతోషిస్తాడు. ప్రజల కోసం యుద్ధానికి వచ్చేటువంటి కారణం నచ్చి ఆ రాజ్యానికి, ప్రజలకు అనావృష్టి, దుర్భిక్షం కలుగకుండా శని భగవానుడు వరం ఇస్తాడు. ఆ వరానికి సంతోషించిన దశరథుడు యుద్ధ నిర్ణయాన్ని విరమించుకుని, ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రంతో స్తుతిస్తాడు.
ఆ స్తోత్రం విన్న శనీశ్వరుడు దశరథుడికి మరొక వరాన్ని ప్రసాదించెను. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి శని యొక్క ఈతిబాధలు తొలగుతాయని చెప్పెను. ఈ పురాణ వృత్తాంతం ఆధారంగా ఏ వ్యక్తి అయితే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదువుతారో వారికి శని బాధలు తొలిగి, శని అనుగ్రహం కచ్చితంగా పొందుతారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కనీసం శనివారం లేదా శని త్రయోదశి వంటి రోజుల్లో స్తోత్ర పారాయణం చేయాలని సూచించారు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు ఈ స్తోత్రాన్ని అందించారు.
దశరథ ప్రోక్త శని స్తోత్రం
అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః
శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః
దశరథ ఉవాచ
కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మందో సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ
సురాసుర కింపురుషా గణేంద్రా
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ
నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ
దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనాని వేశాః పుర పట్టాణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేనా
తస్మై నమః శ్రీరవినందనాయ
తిలైర్య వైర్మాష గుడాన్నదానై
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రెర్నిజ వాసరేచ
తస్మై నమః శ్రీరవినందనాయ
ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ
అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ఠ
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహధ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీ రవినందనాయ
స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య
త్రాతా హరిః శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీ రవినందనాయ
శన్యష్టకం యః పఠతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ పఠేశ్చ
సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః
ఇతి శ్రీ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణం