Head Tonsuring: గుండు కొట్టించుకునే సమయంలో పిలక ఎందుకు ఉంచుకుంటారు? ఇది శుభమా అశుభమాా?
04 December 2024, 19:52 IST
- Head Tonsuring: కేశ ఖండన అనే ముఖ్య ఆచారం సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా నమ్మకం, పవిత్రత, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రక్రియ శాస్త్రోక్త నియమాలను పాటిస్తూ, ప్రత్యేక సందర్భాల్లో జరుపబడుతుంది.
గుండు గీయించుకోవడం
హిందూ ధర్మంలో కేశ ఖండన (గుండు కొట్టించుకోవడం) కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆచరించే సాధారణ ఆనవాయితీగా ఉంది. ఈ ప్రక్రియ ఆచారాల, సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతుంది. శాస్త్రోక్త నియమాలకు లోబడి నిర్వహిస్తారు. కేశ ఖండన ప్రధానంగా నమ్మకం, పవిత్రత, కొత్త ఆరంభాల ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, సందర్భాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
లేటెస్ట్ ఫోటోలు
1. సంస్కారాలలో భాగంగా:
* మొక్కుబడులు తీర్చుకునేందుకు లేదా పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో కేశ ఖండనం నిర్వహిస్తారు. శిశువు జననం తర్వాత ఒక నిర్దిష్ట వయస్సులో (సాధారణంగా 1 లేదా 3 సంవత్సరాలు) లోబడి మాత్రమే ఈ తంతు పూర్తి చేస్తారు. దీనిని శూల కర్మ అంటారు.
* ఉపనయనం లేదా యజ్ఞోపవీతధారణ: బ్రహ్మచర్య ఆరంభంలో పవిత్రతను సూచించేందుకు కేశాలను తొలగిస్తారు. ప్రస్తుత రోజుల్లో ఉపనయనం కార్యక్రమాన్ని పెళ్లికి కొద్ది రోజుల ముందు మాత్రమే నిర్వహిస్తుండగా ఈ సందర్భంలో కేశ ఖండనకు అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు.
2. మతకారక శౌచ నియమాలు:
* అంత్యక్రియల తర్వాత: కుటుంబంలో మరణం జరిగితే, ముఖ్యంగా కర్మ నిర్వాహకులు లేదా ముఖ్య శ్రాద్ధకర్తలు శిరో ముండనం చేయించుకుంటారు. తద్వారా తమ బాధను వ్యక్తీకరించి, శౌచ నిబద్ధత పాటిస్తారు. శవ శుద్ధికి సంకేతంగా భావించబడుతుంది. ఈ సందర్భంలో శిరో ముండనం దు:ఖం, వైరాగ్యం తొలగిపోయేందుకు నిర్వహిస్తారు.
శిక్ష లేదా అపచార పరిహారంగా: గతంలో, కొన్ని ప్రదేశాలలో గుండు కొట్టించడం అనేది శిక్షా విధానంలో భాగంగా ఉండేది. ఇది తక్కువతనాన్ని సూచిస్తుంది.
* యాగం, తపస్సు లేదా వ్రతం సమయంలో శిరో ముండనం చేయించుకోవడం ద్వారా పవిత్రత సంతరించుకున్నట్లుగా భావిస్తారు. దీక్ష లేదా పుణ్యక్షేత్ర యాత్రల సమయంలోనూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
3. ఆచార వ్యవహారాలు:
* దేవస్థానాలు లేదా పవిత్ర స్థలాల్లో (ఉదాహరణకు తిరుపతి) భక్తులు శిరో ముండనం చేయించుకుని తమ భక్తిని ప్రదర్శిస్తారు.
* ఇష్టదేవతలకు మొక్కులు తీర్చే పనిలో భాగంగానూ శిరో ముండనం చేయించుకోవడం అనాదిగా నడుస్తున్న ఆచారం. ఇలా చేయించుకోవడం ద్వారా తమ బాధలన్నీ తొలగిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధపడ్డట్లుగా భావిస్తారు.
4. సాంకేతిక, నైతిక నియమాలు:
- కేశ ఖండన సమయంలో స్నానం చేసి పవిత్రంగా ఉండాలి.
- ఈ ప్రక్రియను పవిత్ర పండితులు లేదా విశ్వసనీయ వ్యక్తుల సమక్షంలో చేయడం శ్రేయస్కరం.
- శుద్ధి, పవిత్రత కాపాడేందుకు ఆచారాన్ని సక్రమంగా పాటించాలి.
5. దైవ అనుగ్రహం కోసం:
- శిరోముండనం చేయించుకోవడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు. జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. గతంలో చేసిన పొరబాట్లను మన్నించి, తమకు శుభాలను కలుగజేయమని దైవాన్ని కోరుకుంటారు.
బ్రహ్మరంధ్రం కోసం పిలక:
శాస్త్రాల ప్రకారం, శిరస్సు పైభాగం (బ్రహ్మరంధ్రం) దివ్యశక్తి ప్రవేశం కోసం ముఖ్యమైనది. శిరో ముండనం చేసినప్పటికీ ఆ భాగంలో పిలక ఉంచడం బట్టి, ఈ దివ్య కేంద్రాన్ని రక్షిస్తుందని భావిస్తారు. ఇది ధ్యానం, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందనే నమ్మకం ఉంది. కొన్ని సందర్భాల్లో మొక్కుబడి పూర్తి కానప్పుడు ఇలా పిలక ఉంచుతారు.
హిందూ సంప్రదాయాల్లో శిరోముండనం అశుభమా, శుభమా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో ఇది శుభప్రదం. మరికొన్ని సందర్భాల్లో చెడుకు స్వస్తి పలికేదిగా భావించవచ్చు. సందర్భాన్ని బట్టి శిరోముండన ఆచార ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.