నిర్జల ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి? పూజా విధానం తెలుసుకోండి
26 May 2023, 9:43 IST
- నిర్జల ఏకాదశి 2023లో మే 31 బుధవారం రాబోతోంది. ఒక ఏడాది కాలంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయని మనకు తెలుసు. వీటిలో నిర్జల ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.
నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి సేవలో తరించాలి
నిర్జల ఏకాదశి దివ్యమైన ఏకాదశి. భీమసేనుడు ఈరోజున ఉపవాసం ఉన్నందున దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈరోజు సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని నిర్జల (జలం కూడా స్వీకరించని) ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం.
లేటెస్ట్ ఫోటోలు
నిర్జల ఏకాదశి వ్రతం, పూజా విధానం
సంవత్సరంలో 24 ఏకాదశులకూ ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజూ నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఈ నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం నుంచి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఆహారం, నీరు తీసుకోకూడదు. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
నిర్జల ఏకాదశి వ్రత కథ
పాండు రాజు కుమారుడు భీమసేనుడు ఆకలికి తట్టుకోలేడు. తన సోదరులందరూ ఏకాదశికి ఉపవాసం ఉంటారు. కానీ తాను ఉండలేకపోతాడు. దీనికి పరిష్కారం కోసం వ్యాస మహర్షిని అడుగుతాడు. దీనికి మహర్షి బదులిస్తూ ‘నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు రెండింటినీ స్వీకరించకుండా ద్వాదశి సూర్యోదయం వరకు ఉండాలి. భక్తిశ్రద్ధలతో ఈ ఉపవాసం ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశిలకు ఉపవాసం ఆచరించిన ఫలితాన్ని పొందుతావు’ అని చెబుతాడు. మహర్షి మాటలు విన్న భీమసేనుడు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాడు. అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు.
నిర్జల ఏకాదశి రోజు చేయాల్సిన దానాలు
నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ దానధర్మాలు చేయాలి. ముఖ్యంగా అన్నదానం, వస్త్ర దానం, దుప్పట్లు, నీటి దానం, పాదరక్షలు, గొడుగు వంటివి దానం చేయాలి.