Maha Shivaratri 2023 । ఇంద్రియమే ఆహారం.. అదే ఉపవాసం అర్థం, శివరాత్రి ఆంతర్యం తెలుసుకోండి!
Maha Shivaratri 2023: మహా శివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి ఉంటుంది. శివరాత్రులు ఎన్ని రకాలు ఉంటాయి, శివరాత్రి ఆంతర్యం ఏమిటో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Maha Shivaratri 2023: ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రి గల) చతుర్దశి నాడు 'మాస శివరాత్రి'గా జరుపుకుంటారు. అయితే మాఘ బహుళ చతుర్దశి నాడు మహా శివరాత్రి వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మహా శివరాత్రిని శివుని జన్మదినంగా భక్తులు వైభవంగా జరుపు కుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం.
పరమ శివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. ఆ రోజున శివాలయములలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివ రాత్రి నాడు ఆచరించవలసిన విధులు. శివుడు అభిషేక ప్రియుడు కావున శివరాత్రుల సమయంలో రుద్రాభిషేకములు, శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదం.
శివ రాత్రులు ఐదు రకాలు.
1. నిత్యశివరాత్రి: ప్రతి రోజూ శివారాధన చేస్తారు.
2. పక్ష శివరాత్రి: ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షములలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం.
3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాస శివరాత్రి.
4. మహా శివరాత్రి: మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్టమన శివరాత్రి.
5. యోగ శివరాత్రి: యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివ చింతన.
శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్ష మాలతో 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.
ఉపవాసం అంటే?
ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా. తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివ జ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహా శివరాత్రి ఆంతర్యం.
మహా శివరాత్రి నాటి అర్థరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.
సోమవారం 'ఇందుప్రదోషం'గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనము. 16 సోమవారములు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శివారాధన గావించి, నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్ర వ్రతం అంటారు. 'నిర్ణయసింధు' లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.
శివరాత్రి కథనాలు
- బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము బ్రహ్మ, విష్ణువులలో ఏర్పడింది. ఆ వాదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది. ఆ లింగం ఆది, అంతాలను కనుగొన్నవారు గొప్ప అని బ్రహ్మ, విష్ణులకు శివుడు సూచిస్తాడు. కానీ బ్రహ్మ, విష్ణులు ఇద్దరూ లింగం ఆది, అంతం కనుగొనడంలో విఫలం అవుతారు. ఆది అంతం లేని శివుడే సర్వేశ్వశరుడు అని అప్పుడు తెలిసివస్తుంది.
- శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం.
- లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నదీ ఈరోజునే అని చెబుతారు.
- జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని శ్రీకృష్ణుడు ఇదే రోజున శివుణ్ణి ప్రార్ధించాడనే కథనం వ్యాప్తిలో ఉంది.
-క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి.
మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తి గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం