Feng shui tips for love life: మీ ప్రేమ జీవితం మధురంగా ఉండాలంటే.. ఈ ఫెంగ్‌షూయి టిప్స్ పాటించండి
13 February 2024, 12:38 IST
- Feng shui tips for love life: ప్రేమ జీవితం సంతోషంగా సాగిపోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫెంగ్‌షూయి టిప్స్ ఫాలో అయిపోండి. మీ లవ్ లైవ్ అద్భుతంగా ఉంటుంది.
ప్రేమ జీవితం మధురంగా ఉంచే ఫెంగ్ షూయి టిప్స్
Feng shui tips for love life: భార్యాభర్తల బంధం మధురంగా ఉంటే ఆ ఇల్లు బృందావనంగా ఉంటుంది. సంతోషం, ఆనందం, శ్రేయస్సుతో ఇల్లంతా ఆహ్లాదకర వాతావరణంతో నిండిపోతుంది. అదే వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలు ఉంటే మాత్రం ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ఒక్క క్షణం ఇంట్లో ఉండాలన్నా కూడా మనసు ఒప్పుకోదు.
వివాహ బంధం నిలవాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అనురాగం, నమ్మకం ఉండాలి. ఒకరంటే ఒకరికి బాధ్యత ఉండాలి. అప్పుడే ఆ జంట ఎన్ని కష్టాలు ఎదురైన సులభంగా వాటిని అధిగమించగలుగుతుంది. ప్రేమ ఉండి నమ్మకం లేకపోతే ఆ జంట కలిసి ఉన్నా ప్రయోజనం ఉండదు.
భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి ఒకరకంగా వాస్తు దోషాలు, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా కారణం అవుతుంది. వాటిని తొలగించుకునేందుకు ఈ ఫెంగ్‌షూయి చిట్కాలు పాటించి చూడండి. మీ ప్రేమ జీవితం అత్యంత మధురంగా ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుంది.
ఫెంగ్‌షూయి ప్రకారం ఇంట్లో తాబేలు, మాండరిన్ బాతు, ఒంటె, చైనీస్ నాణేలు వంటి అనేక వస్తువులు పెట్టుకుంటే మంచిది. ఫెంగ్ షూయి ప్రకారం వీటిని చాలా పవిత్రమైన వస్తువులుగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుంది. విజయ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిస్తుందని నమ్ముతారు. కొన్ని నియమాలు పాటిచడం ద్వారా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాల్లో విభేదాలు తొలగిపోతాయి.
రోజ్ క్వార్ట్జ్
వైవాహిక జీవితంలో వచ్చే సమస్యల్ని తగ్గించేందుకు ఫెంగ్‌షూయి ప్రకారం రోజ్ క్వార్ట్జ్ ఇంట్లో పెట్టుకోండి. ఇది మీ జీవితాన్ని ప్రేమతో నింపేస్తుంది. గులాబీ రంగులో ఉండే ఈ రాయి ఇంట్లో ఉంటే చాలా మంచిది. పడకగదిలో దీన్ని పెట్టుకుంటే సానుకూల శక్తి ప్రసరిస్తుంది. పడకగది ఆగ్నేయ మూలలో దీన్ని పెట్టుకోవచ్చు.
అలంకరణ ముఖ్యం
సంబంధంలో ప్రేమ, శృంగారభరిత జీవితం గడపాలని అనుకుంటే మీ పడక గది అలంకరణ చాలా ముఖ్యం. బెడ్ రూమ్‌కి ఉండే రంగు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. పింక్ కలర్ థీమ్‌తో పడక గది అలంకరించుకోవచ్చు. అలాగే ప్రేమని వ్యక్తపరిచే విధమైన చిత్రపటాలు, కళాకృతులూ కూడా బెడ్ రూమ్ గోడలకు తగిలించుకోవచ్చు. ప్రశాంతమైన రంగులు బెడ్ రూమ్ లో ఉండేలా చూసుకోవాలి.
మాండరిన్ బాతులు
ఫెంగ్ షూయి వస్తువులలో ఉత్తమమైన ఎంపిక మాండరిన్ బాతులు జత. ఇవి నమ్మకం, శృంగార సంబంధానికి చిహ్నంగా భావిస్తారు. వీటిని బెడ్ రూమ్ నైరుతి మూలలో పెట్టుకోవచ్చు. ఇవి ఉంచడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఈ మాండరిన్ బాతులు జతగా మాత్రమే ఉండాలి.
చైనీస్ నాణేలు
చైనీస్ నాణేలు అదృష్టం, సంపద, సానుకూలత, స్వచ్చతకి చిహ్నంగా పరిగణిస్తారు. రాగి నాణేలు పసుపు లేదా ఎరుపు రిబ్బన్‌తో కట్టిన వాటిని ఇంట్లో వేలాడదీసుకోవచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శ్రేయస్సుని ఆకర్షిస్తుంది.
పచ్చని మొక్కలు
ఇంటికి మొక్కలు ఇచ్చే అందం వేరే ఏవి ఇవ్వవు. ఇంట్లో పచ్చని మొక్కలు పెట్టుకుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవి గాలిని శుద్ది చేయడం మాత్రమే కాదు మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. మీ వివాహ బంధాన్ని ప్రేమతో నింపేస్తుంది. బెడ్ రూమ్‌లో ముళ్ళ మొక్కలు అసలు పెట్టుకోకూడదు. ఇది జీవితాన్ని సమస్యల్లో పడేస్తుంది.
చిందరవందరగా ఉంచొద్దు
పడక గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్ షీట్స్ చక్కగా వేసుకోవాలి. బెడ్ రూమ్‌లోని వస్తువులు క్రమ పద్ధతిలో సర్దుకోవాలి. అవసరమైన వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి. చిందరవందర వస్తువులు మనసుని గందరగోళంగా ఉంచుతాయి.
తాజా పువ్వులు
పడకగదిలో ఎప్పుడూ తాజా పువ్వులు పెట్టుకోండి. ఇవి గదికి మంచి సువాసన ఇవ్వడమే కాదు అందంగా కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది.