Tortoise ring: తాబేలు ఉంగరం ధరిస్తే ఏమవుతుంది? ఏ వేలికి ఈ ఉంగరం పెట్టుకోవాలి?
Tortoise ring: చాలా మంది వేళ్ళకి తాబేలు ఉంగరం చూసే ఉంటారు. అసలు ఈ తాబేలు ఉంగరం ఎందుకు ధరిస్తారో తెలుసా? ఈ ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుంది?
Tortoise ring: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలుని శుభ ప్రదంగా భావిస్తారు. అందుకే ఇంట్లో క్రిస్టల్ తాబేలు ప్రతిమని పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్‌షూయి ప్రకారం కూడా తాబేలు ఇంట్లో ఉంటే అన్ని వాస్తు దోషాలు తొలగిపోయి సుఖమైన జీవితం గడుపుతారని చెబుతారు. ఇంట్లో మంచి జరగాలని సంపద నిలవాలని కోరుకుంటూ తాబేలు ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటారు.
తాబేలు బొమ్మ మాత్రమే కాదు తాబేలు ఉంగరం కూడా శుభ చిహ్నంగానే చూస్తారు. ఈరోజుల్లో చాలా మంది తమ వేలికి తప్పనిసరిగా తాబేలు ఉంగరం ధరిస్తున్నారు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చని నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించడం లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణువు పది అవతారాలలో రెండో అవతారం కూర్మావతారం. అందుకే తాబేలుని మంచికి చిహ్నంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల దాని ఫలితం మీకు లభించదు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే తాబేలు ఉంగరం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి ప్రకారమే ఈ ఉంగరం ధరించాల్సి ఉంటుంది.
తాబేలు ఉంగరం ధరించేందుకు నియమాలు
ఎప్పుడంటే అప్పుడు తాబేలు ఉంగరం కొనడం, ధరించడం చేయకూడదు. శుక్రవారం రోజునే ఈ ఉంగరం కొననుగోలు చేయాలి. అలాగే దాన్ని శుద్ది చేయకుండా పెట్టుకోకూడదు. ఉంగరం కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పాలు, గంగా జలంలో కొన్ని గంటల పాటు ఉంచాలి. ఉంగరం శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయాలి. అలాగే లక్ష్మీ నారాయణుడికి కూడా పూజ చేయాలి. ఈ ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం ధరించడం శుభప్రదంగా చెప్తారు.
తాబేలు ఉంగరాన్ని చూపుడు వేలు లేదా మధ్య వేలికి మాత్రమే ధరించాలి. తాబేలు తల భాగం మీ వైపు గా మాత్రమే ఉండేవిధంగా పెట్టుకోవాలి. వ్యతిరేక దిశలో ధరించకూడదు. వెండితో తయారు చేసిన తాబేలు ఉంగరం ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మీ జీవితంలో జరిగే ఆర్థిక ఇబ్బందులని కూడా తొలగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉండేలా చేస్తుంది.
తాబేలు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు
తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది.
ఇంట్లో సానుకూల వాతావరణం ఉండి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అయితే ఈ ఉంగరం ఎవరంటే వాళ్ళు ధరించడం మంచిది కాదు. జ్యోతిష్యుని సలహా తీసుకున్న తర్వాత జాతకం ప్రకారం ఈ ఉంగరం ధరించడం మంచిది. మేషం, వృశ్చికం, కర్కాటకం, మీనం రాశుల వాళ్ళు ఈ తాబేలు ఉంగరం ధరించకూడదు.