Navaratri 8Th Day : నవరాత్రులలో ఎనిమిదో రోజు.. శ్రీ దుర్గాదేవి అవతార విశిష్టత
22 October 2023, 5:00 IST
- Navaratri 8Th Day : దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అప్పుడే ఎనిమిదో రోజు వచ్చేసింది. అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ అవతారం విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దుర్గా మాత
శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదవరోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఆదివారం రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు మహాకాళిగా పూజిస్తారు. దేవీ నవరాత్రులలో అత్యంత ప్రాధాన్యమైన రోజు. దుర్గామాత అని తలవగానే మన మనస్సులో త్రిశూలధారియై, వ్యాఘ్రవాహన అయి, శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది.
లేటెస్ట్ ఫోటోలు
ఆ సకల శక్తి స్వరూపిణిని 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్! అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే భక్తులకు దుర్గతులు పోతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దుర్గముడనే అసురుని సంహారం చేయడానికి దుర్గాదేవిగా ఆవిర్భవించింది మహేశ్వరి. ఆ రాక్షసుని ఎలా అంతమొందించిందో భక్తుల దుర్గమాలను(కష్టాలను) కూడా అలాగే రూపుమాపుతుంది దుర్గమ్మ. రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులు కలుగుతాయని చిలకమర్తి చెప్పారు.
శ్రీ లలితా సహస్రనామంతో పాటు శ్రీ దేవీ ఖద్గమాలా స్తోత్రం పారాయణం చేసుకుంటే, భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి. దుర్గాష్టమి నాడు 6 నుండి 12 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు, కానుకలు ఇస్తారు. బొమ్మలకొలువు పేరంటం చేస్తారు. సరస్వతీదేవి పూజనాడు మొదలుపెట్టిన త్రిరాత్రవ్రతం ఈ రోజు కొనసాగిస్తారు. ఈ విశిష్ట పర్వదినాన శ్రీ దుర్గాదేవికి మిక్కిలి ప్రీతికరమైన పులగాన్నం, పులిహోర నివేదన చేస్తే చాలా ఫలప్రదం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ధరించవలసిన వర్ణం ఎరుపు రంగు.