తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress - Tmc: ‘‘మమత బెనర్జీ లేని విపక్ష కూటమిని ఊహించలేం’’: కాంగ్రెస్

Congress - TMC: ‘‘మమత బెనర్జీ లేని విపక్ష కూటమిని ఊహించలేం’’: కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu

24 January 2024, 16:59 IST

  • Congress - TMC: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ చేసిన ప్రకటన కాంగ్రెస్ లో ప్రకంపనలను సృష్టిస్తోంది. దాంతో,నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Utpal Sarkar)

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ

Congress - TMC: పశ్చిమ బెంగాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.

మమతే మూల స్తంభం

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో కలిసి అస్సాంలోని బార్ పేటలో ఉన్న జైరాం రమేష్ బుధవారం మాట్లాడుతూ.. 'విపక్ష కూటమికి తృణమూల్ కాంగ్రెస్ మూలస్తంభం. మమత బెనర్జీ లేని ఇండియా కూటమిని ఊహించలేం’’ అని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిలో అత్యంత కీలకమైన నాయకురాలని జైరాం రమేష్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం మనందరి ప్రధాన బాధ్యత అని మమతా బెనర్జీ చెప్పారని రమేశ్ గుర్తు చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమత బెనర్జీ ప్రకటనపై జైరాం రమేశ్ స్పందించారు. ‘‘మీరు ఆమె పూర్తి ప్రకటనను చదవలేదు. బీజేపీని ఓడించాలని తాను కోరుకుంటున్నానని, అందుకోసం తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోనని ఆమె స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో మేము (భారత్ జోడో న్యాయ్ యాత్ర) పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశిస్తున్నాం. మనం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్, స్పీడ్ బ్రేకర్ అంటే ప్రయాణం ముగుస్తుందని కాదు’’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

రాహుల్ రియాక్షన్

మమతా బెనర్జీ విపక్ష కూటమి లో కీలక నేత అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మమత పశ్చిమబెంగాల్ లోనే కాదు, భారత దేశంలోనే గొప్ప నాయకురాలు అని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాదు, మమత తనకు, కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితురాలని వ్యాఖ్యానించారు. కాగా, పశ్చిమ బెంగాల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ లోని ఎవరితోనూ మాట్లాడలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీతో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని అసోంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పిన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 28 పార్టీల ప్రతిపక్ష ఇండియా కూటమిలో టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం లు కూడా భాగస్వామ్యులుగా ఉన్నాయి.

బీజేపీ స్పందన

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పశ్చిమ బెంగాల్ లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ మాట్లాడుతూ ఇది నైరాశ్యానికి సంకేతమని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను ఆయన సర్కస్ తో పోలుస్తూ, ఆ సర్కస్ బెంగాల్ కు రాకముందే.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమత ప్రకటించడం విపక్ష ఇండియా కూటమికి చావుదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించారు.