Bharat Jodo Yatra : 4000 కిలోమీటర్లు.. 140 రోజులు- భారత్ జోడో యాత్ర హైలైట్స్ ఇవే!
30 January 2023, 7:29 IST
- Bharat Jodo Yatra to end today : భారత్ జోడో యాత్రకు నేటితో శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో యాత్ర హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాము.
రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra to end today : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "భారత్ జోడో యాత్ర"పైనే ఇప్పుడు చర్చంతా! ఎన్ని సమస్యలు ఎదురైనా.. యాత్రను విజయవంతంగా ముగించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తోటి కాంగ్రెస్ శ్రేణులకు.. తనలోని కొత్త రాహుల్‌ను పరిచయం చేశారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని పెంపొందించారు. ఇక నేటితో భారత్ జోడో యాత్రకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో.. భారత్ జోడో యాత్రలోని కొన్ని హైలైట్స్‌ను ఓసారి చూద్దాం..
యాత్ర.. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్..
ఈ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 140కురోజులకు పైగా.. దాదాపు 4వేల కి.మీలు సాగింది ఈ యాత్ర. జమ్ముకశ్మీర్‌లో సోమవారం జరగనున్న ఈవెంట్‌తో యాత్రకు శుభం కార్డు పడనుంది. ఆదివారం శ్రీనగర్‌లో.. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తన జీవితంలో ఈ భారత్ జోడో యాత్రకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు.
Rahul Gandhi Bharat Jodo Yatra : యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. కేవలం 5 నెలలలోపే ఇవి జరగడం విశేషం. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ ప్రాంతాలను చుట్టేశారు కాంగ్రెస్ సీనియర్ నేత.
భారత్ జోడో యాత్రలో భాగంగా.. దేశంలోని కీలక విపక్ష నేతలు సైతం రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. పీడీపీ చీఫ్ మెహ్‌బూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లాలు.. భారత్ జోడో యాత్ర చివరి దశలో పాల్గొన్నారు. దిగ్గజ సినీ నటుడు, ప్రముఖ రాజకీయ నేత కమల్ హాసన్ సైతం.. ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. యాత్ర.. మహారాష్ట్రలో ఉండగా.. శివసేన నేత ఆదిత్య ఠాక్రే సైతం రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. సెప్టెంబర్‌లో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా యాత్రలో పాల్గొన్నారు.
Bharat Jodo Yatra Congress : రాజకీయ నేతలే కాదు.. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, సినీ నిర్మాత పూజా భట్, బాలీవుడు నటులు స్వరా భాస్కర్, సుశాంత్ సింగ్, రష్మి దేశాయ్, అంకుషా పూరితో పాటు అనేకమంది రాహుల్‌తో కలిసి నడిచారు.
యాత్రతో కాంగ్రెస్ పరిస్థితి మారేనా?
ఓవైపు భారత్ జోడో యాత్ర జరుగుతుంటే.. మరోవైపు దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అవి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. 2022 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ప్రదర్శన చేసింది! పార్టీకి కేవలం 17 సీట్లే దక్కాయి. ఓట్ల శాతం 27కు పడిపోయింది. 2017లో కాంగ్రెస్.. 77 సీట్లను వెనకేసుకుది. నాడు ఓట్ల శాతం 41గా ఉండేది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించింది కాంగ్రెస్. 40 సీట్లల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయంలో రాహుల్ గాంధీ పాదయత్ర కూడా కీలక పాత్ర పోషించిందని అనేకమంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
Bharat Jodo Yatra today : జనవరిలో "మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్" పరుతో ఓ సర్వే జరిగింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ప్రజల దృష్టిని ఆకర్షించిందని ఆ సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించిందని 37శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ యాత్ర కాంగ్రెస్‌కు పనిచేయదని వారు పేర్కొన్నారు! భారీ స్థాయిలో ప్రజలను కనెక్ట్ అయ్యేందుకు భారత్ జోడో యాత్ర ఉపయోగపడిందని 29శాతం మంది అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ బ్రాండ్, ఇమేజ్ను పెంచుకోవడం కోసమే ఈ యాత్ర పనిచేసిందని మరో 13మంది తెలిపారు. ఈ యాత్రతో కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని మరో 9మంది భావించారు.
బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ ఎదురు దాడి!
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీపై బీజేపీ నిత్యం విమర్శల వర్షం కురిపించింది. భారత్ జోడో యాత్రను.. "భారత్ తోడో యాత్ర"గా అభివర్ణిస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ వేసుకున్న దుస్తులు, ఆయన గడ్డంపైనా ఆరోపణలు చేసింది. ఆయన వేసుకున్న టీ-షర్ట్ ఖరీదు రూ. 41వేలని ఆరోపించింది. అందుకు బదులుగా.. "మోదీ వేసుకునే సూట్ ధర రూ. 10లక్షలు" అని విమర్శించింది కాంగ్రెస్. గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ.. మాజీ నియంత సద్దామ్ హుస్సేన్‌తో పోల్చారు అసోం సీఎం, కాంగ్రెస్ మాజీ చీఫ్ హిమంత బిశ్వ శర్మ.
Bharat Jodo Yatra live : భారత్ జోడో యాత్రలో పలు అపశ్రుతులు కూడా చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో యాత్ర సాగుతుండగా.. రాహుల్ గాంధీ పక్కనే ఓ కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో కుప్పకూలారు. అనంతరం ఆయన మరణించారు. మహారాష్ట్ర నాందేడ్‌లో యాత్ర సాగిన వేళ ఓ కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. నాందేడ్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. తమిళనాడుకు చెందిన 62ఏళ్ల వ్యక్తిని ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన మరణించాడు.