Rahul Gandhi challenge to Amit Shah: అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్.. మోదీని ప్రశంసించిన బీజేపీ నేతలు-congress leader rahul gandhi challenges union home minister amir shah bjp praise for pm modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Challenge To Amit Shah: అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్.. మోదీని ప్రశంసించిన బీజేపీ నేతలు

Rahul Gandhi challenge to Amit Shah: అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్.. మోదీని ప్రశంసించిన బీజేపీ నేతలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2023 11:22 PM IST

Rahul Gandhi challenge to Amit Shah: కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఉందని బీజేపీ నేతలు పదేపదే చెబుతుండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‍ షాకు ఓ చాలెంజ్ విసిరారు.

Rahul Gandhi challenge to Amit Shah: అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్
Rahul Gandhi challenge to Amit Shah: అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్ (PTI)

Rahul Gandhi challenge to Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షాకు సవాల్ విసిరారు కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ. జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లో శాంతి భద్రతలు మెరుగయ్యాయని నిరూపణ చేయాలంటూ ఓ చాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించాక రాజకీయ హీట్ మరింత పెరిగింది. ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య మాటల యుద్ధం అధికమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని లాల్ చౌక్‍లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ చేశారు. జమ్ము కశ్మీర్‌లో అంతా సవ్యంగా ఉంటే జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు నడవాలంటూ చాలెంజ్ చేశారు. పూర్తి వివరాలివే..

ఎందుకు అలా చేయరు!

Rahul Gandhi challenge to Amit Shah: జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అంతా ప్రశాంతంగా ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు వారు జమ్ము నుంచి లాల్ చౌక్‍కు ఎందుకు నడవకూడదని రాహుల్ గాంధీ అన్నారు. “ఒకవేళ పరిస్థితి చాలా భద్రతగా ఉంటే అమిత్ షా ఎందుకు జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు నడవరు?” అని శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం రేపు (జనవరి 30) శ్రీనగర్‌లోనే జరగనుంది.

మోదీ వల్లే రాహుల్ అలా చేయగలిగారు

కశ్మీర్‌లో జాతీయ పతాకాన్ని రాహుల్ గాంధీ ప్రశాంత వాతావరణంలో ఎగురవేయడం ప్రధాని మోదీ వల్లే జరిగిందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‍ 370 (Article 370)ను రద్దు చేసిన కారణంగానే శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ స్వేచ్ఛగా పతాకావిష్కరణ చేయగలిగారని అన్నారు. “శ్రీనగర్‌లోని లాల్ చౌక్‍లో త్రివర్ణ పతాకాన్ని రాహుల్ గాంధీ నేడు ఎలా ప్రశాంతంగా ఆవిష్కరించగలిగారు? జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‍ను మోదీ రద్దు చేయడం వల్లే ఇది జరిగింది. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌కు పర్యాటకుల రాక పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కశ్మీర్‌లో ఉగ్రవాదం, భయం ఉండేవి” అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

భారత్ జోడో యాత్రకు ముగింపు

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు (జనవరి 30, సోమవారం) ముగియనుంది. శ్రీనగర్‌లో కాంగ్రెస్ నేతలతో పాటు మరికొన్ని విపక్షాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. 14 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా ఈ యాత్ర జరిగింది. 3,800 కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర సాగిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

భద్రత కల్పించటంలో లోపాలు ఉన్నాయన్న కారణంతో ఈనెల 27న భారత్ జోడో యాత్రను కశ్మీర్‌లో నిలిపివేసింది కాంగ్రెస్. యాత్రకు భద్రత కల్పించటంలో జమ్ము కశ్మీర్ యంత్రాంగం విఫలమైందని ఆ పార్టీ ఆరోపించింది.

Whats_app_banner

సంబంధిత కథనం