Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు రేపే ముగింపు.. రాహుల్ శ్రమ ఫలించేనా?
Bharat Jodo Yatra today : భారత్ జోడో యాత్రకు సోమవారం ముగింపు పడనుంది. శ్రీనగర్‌లో నిర్వహించిన ముగింపు సభలో పాల్గొనాలని 21 పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వాటిల్లో కేవలం పార్టీలే హాజరవుతాయని సమాచారం.
Bharat Jodo Yatra live : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కన్యాకుమారి టు కశ్మీర్ "భారత జోడో యాత్ర"కు సోమవారంతో ముగింపు పడనుంది. ఈ సందర్భంగా.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు దేశంలోని విపక్షానికి చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొననున్నారని సమాచారం.
యాత్రకు దూరంగా ఆ పార్టీలు..!
భారత్ జోడో యాత్ర ముగింపు వేడుకల కోసం విపక్షానికి చెందిన మొత్తం 21 పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీటిల్లో 12 పార్టీలు మాత్రమే.. కశ్మీర్‌కు వెళ్లనున్నట్టు సమాచారం.
Bharat Jodo Yatra in Jammu Kashmir : ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, శరద్ యాదవ్ ఎన్సీపీ, తేజస్వీ యాదవ్ ఆర్జేడీ, నితీశ్ కుమార్ జేడీయూ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సీపీఐఎం, సీపీఐ, వీసీకే (విద్యుథలై చిరుథైగల్ కచ్చి), కేరళ కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ పీడీపీ, శిబు సొరేన్‌కు చెందిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు.. శ్రీనగర్‌లో జరగనున్న సభకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, చంద్రబాబు నాయుడు టీడీపీతో పాటు మరికొన్ని విపక్ష బృందాలు.. భారత్ జోడో యాత్ర ముగింపు సభకు దూరంగా ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భద్రతా కారణాలతో ఆయా పార్టీలు సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు వివరించాయి.
కన్యాకుమారి టు కశ్మీర్.. భారత్ జోడో యాత్ర..
Bharat Jodo Yatra today : అంతర్గత కుమ్ములాటలు, ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ ఫిరాయింపులు, వలస మధ్య రాహుల్ గాంధీ అధ్యక్షతన సాగుతున్న ఈ 'భారత్ జోడో యాత్ర'.. కాంగ్రెస్‌కు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. 3,900 కిమీలు ప్రయాణించి కశ్మీర్‌కు కొన్ని రోజుల క్రితమే చేరుకుంది. ఈ 145 రోజుల యాత్ర.. సోమవారంతో ముగియనుంది.
దాదాపు 4వేల కిలోమీటర్ల ప్రయాణంలో.. లక్షలాది మంది ప్రజలను కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా.. భారతీయులను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు చెబుతూ వచ్చారు.
Rahul Gandhi Bharat Jodo Yatra : ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది.. మెగా వార్ 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ పడిన శ్రమ, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది వేచి చూడాలి.
సంబంధిత కథనం