PM KISAN 13th Installment : పీఎం కిసాన్ 13వ విడత నిధులు విడుదల
27 February 2023, 21:41 IST
- PM KISAN 13th Installment release : పీఎం కిసాన్ 13వ విడత నిధులు సోమవారం విడుదలయ్యాయి. ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు. ఈ సారి దాదాపు 8కోట్ల మంది లబ్ధిపొందనున్నారు.
పీఎం కిసాన్ 13వ విడత నిధులు విడుదల
PM KISAN 13th Installment released : పీఎం కిసాన్ 13వ విడత నిధులను సోమవారం విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దఫాలో మొత్తం మీద రూ. 16,800కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. దాదాపు 8కోట్ల మంది లబ్ధిదారులకు.. హోలీ, రబీ సీజన్‌కు ముందే ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాల్లోకి నిధులు చేరతాయని ప్రభుత్వం చెప్పింది.
కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పీఎం కిసాన్ 13వ విడత నిధులను విడుదల చేశారు. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా.. లబ్ధిదారులకు వార్షికంగా రూ. 6వేలు అందుతాయి. ఏడాది పొడవునా మూడు విడతల్లో రూ. 2వేలు చేరతాయి. పీఎం కిసాన్ 11, 12 విడతల నిధులు గతేడాది మే, అక్టోబర్‌లో విడుదలయ్యాయి.
PM KISAN 13th Installment date 2023 : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ప్రకారం.. పీఎం కిసాన్ పథకంతో ఇప్పటివరకు 11కోట్లకుపైగా అన్నదాత కుటుంబాలు లబ్ధిపొందాయి. రూ. 2.25లక్షల కోట్ల నిధులు రైతులకు చేరాయి. ఒక్క కొవిడ్ సంక్షోభంలోనే రైతులకు రూ 1.75లక్షల కోట్ల డబ్బులు అందాయి. ఇక ఈ పథకంలో భాగంగా 3కోట్లకుపైగా మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 53,600కోట్లు పడ్డాయి.
2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికి ఆర్థికంగా మద్దతిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ నిధులతో రైతులు.. తమ పొలానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవడంతో పాటు, విద్య, పెళ్లి, వైద్యం వంటివి కూడా సమకూర్చుకోవచ్చు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టేటస్ చెక్ చేసుకోండిలా..
స్టెప్ 1:- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి
స్టెప్ 2:- అనంతరం హోమ్‌పేజీలోని ఫార్మర్స్ కార్నర్ (Formers Corner) సెక్షన్ కింద బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
PM KISAN 13th Installment : స్టెప్ 3:- అక్కడ మీ పీఎం-కిసాన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
స్టెప్ 4:- అనంతరం గెట్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 5:- అప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
స్టెప్ 6:- దాన్ని డౌన్లోడ్ చేసుకొని, సేవ్ చేసుకోండి
మీ ఖాతాలో డబ్బు క్రిడెట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ డబ్బు జమ కాకపోతే కారణాన్ని కూడా తెలుపుతుంది.